లాక్‌డౌన్‌ కష్టాలు.. కుటుంబ పోషణ కోసం ఓ తండ్రి

Father Sells 4 Month Old Girl Child to Feed Family - Sakshi

డిస్పూర్‌: కరోనా వైరస్‌ని నియంత్రించడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. పని లేదు.. చేతిలో పైసా లేదు.. దాంతో ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. వందల మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కడుపు నింపుకోవడం కోసం వారు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో తినడానికి తిండిలేక బాధపడుతున్న ఓ వలస కూలీ తన నాలుగు నెలల కుమార్తెను 45,000 రూపాయలకు విక్రయించాడు. ఈ సంఘటన అస్సాంలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కొక్రాజార్ జిల్లాలోని అటవీ గ్రామమైన ధంటోలా మాండరియాలో నివసించే దీపక్ బ్రహ్మ గుజరాత్‌లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ విధించడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో పనిలేక తీవ్ర పేదరికంలో ఉండగా దీపక్‌ భార్య రెండో సంతానంగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటికే వారికి ఏడాది వయసున్న ఓ కుమార్తె ఉంది. (‘నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు’)

మళ్లీ ఆడపిల్ల జన్మించడం.. చేతిలో పైసా లేకపోవడంతో నాలుగు నెలల పసికందును.. 45,000 రూపాయలకు విక్రయించాడు. అది కూడా భార్యకు తెలియకుండా. ఈ క్రమంలో బిడ్డ గురించి భార్య, దీపక్‌ను ప్రశ్నించగా.. విక్రయించానని తెలిపాడు. దాంతో వెంటనే గ్రామస్తుల సాయంతో భార్య కొచ్చుగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి బిడ్డను కొన్న మహిళల నుంచి శిశువును రక్షించి తల్లి  ఒడికి చేర్చారు. ఆ తరువాత బ్రహ్మను అరెస్టు చేశారు. తమకు సంతానం లేకపోవడంతోనే శిశువును కొన్నామని విచారణలో ఆ ఇద్దరు మహిళలు తెలియజేశారు. 

‘శిశువును రక్షించినందుకు పోలీసులకు నిజంగా కృతజ్ఞతలు. అయితే ఈ సమస్య చాలా తీవ్రమైంది. లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది. అటవీ గ్రామాల్లో నివసించేవారికి పరిస్థితి మరీ దారుణం’ అని నేడాన్ ఫౌండేషన్ చైర్మన్ దిగంబర్ నార్జరీ అన్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top