విషాదం: యువకుడి బలవనర్మణం

Bengal Man Eliminates Himself Family Alleges Cops Tortured Him Over Theft - Sakshi

దొంగతనం ఆరోపణలు.. ఉరివేసుకున్న వలస కార్మికుడు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలానికి తిరిగి వచ్చిన ఓ వలస కార్మికుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దొంగతనం ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్ర హింసలు పెట్టిన కారణంగానే బాధితుడు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. బీర్భూం జిల్లా రూపుష్‌పూర్‌ అనే గ్రామానికి చెందిన సౌవిక్‌ గొరాయి(22) అనే యువకుడు కొంతకాలం క్రితం ఉపాధి కోసం గుజరాత్‌కు వలస వెళ్లాడు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చాడు. (లవ్‌ జిహాద్‌ : పేరు మార్చుకుని వలపు వల)

ఈ క్రమంలో షిబు రాయ్‌ అనే దుకాణ యజమాని సోమవారం తన సైకిల్‌, షాపులోని సిలిండర్‌ చోరీకి గురయ్యాయని పోలీసులకు సమాచారమిచ్చాడు. సౌవికే ఈ దొంగతనానికి పాల్పడ్డాడని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందకపోయినప్పటికీ పోలీసులు సౌవిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల తర్వాత అతడిని విడిచిపెట్టారు. అయితే కూలోనాలో చేసుకుని బతుకుతూ పొట్టపోసుకుంటున్న తనపై దొంగ అనే ముద్ర వేసారని ఆవేదన చెందిన బాధితుడు భుజాలకు బరువైన సంచీ ఒకటి తగిలించుకుని తన ఇంట్లో అదే రోజు ఉరివేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. పోలీసుల తీరు వల్లే అమాయకుడైన సౌవిక్‌ ప్రాణాలు కోల్పోయాడంటూ స్థానికులు ఆరోపించారు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న సౌవిక్‌ ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడని, అతడు దొంగతనం చేశాడంటే నమ్మబుద్ధికావడం లేదని చెప్పుకొచ్చారు.(ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!)

 చిత్ర హింసలు పెట్టారు
ఇక ఒక్కగానొక్క కొడుకు శాశ్వతంగా తనకు దూరం కావడంతో సౌవిక్‌ తండ్రి గుండెపగిలేలా రోదిస్తున్నాడు. ‘‘నా కొడుకును పోలీస్‌ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఇష్టం వచ్చినట్లు కొట్టారు. చేయని నేరం మీద వేసుకోవాలని వేధించారు. తనని విడిచిపెట్టమని నేనెంతగానో బతిమిలాడాను. నన్ను కూడా దూషించారు. ఓ అధికారి నా కళ్ల ముందే నా కొడుకును చిత్ర హింసలు పెట్టారు. న్యాయం చేయాల్సిన పోలీసులే మనం ఇంకా ఎక్కడికి వెళ్తాం. లాక్‌డౌన్‌ వల్ల మూడు నెలల క్రితం ఇంటికి వచ్చిన నా కొడుకు ఇప్పుడు శాశ్వతంగా దూరమైపోయాడు’’అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఈ ఘటనపై స్పందించిన బిర్భూం జిల్లా ఎస్పీ శ్యామ్‌ సింగ్‌ బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top