మరో విషాదం.. రైలు కింద తోసేసి యువతి హత్య.. గుండెపోటుతో తండ్రి కూడా

Father Of Chennai Murdered College Girl Died After Hearing Daughter Death News - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన యువతి ఘటనలో మరో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి కూతురు మృతిచెందిందన్న వార్త తెలియడంతో ఆమె తండ్రి గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు. చెన్నైలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మృతురాలి తల్లి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.  కాగా ప్రేమను నిరాకరించిందన్న కారణంతో యువతిని రైలు కిందకు తోసేసి ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్‌ ఘటన తమిళనాడులోని చెన్నైలో గురువారం చోటుచేసుకుంది. 

ఆదంబాక్కంకు చెందిన మాణిక్యం కూతురు సత్య(20) టీనగర్‌లోని ప్రైవేట్‌ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన సతీష్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి సెయింట్‌ థామస్‌మౌంట్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడకు వచ్చిన యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
సంబంధిత వార్త: ప్రేమోన్మాది ఘాతుకం.. కానిస్టేబుల్‌ కూతురు దారుణ హత్య

తనను ప్రేమించమని, పెళ్లి చేసుకోమని చాలా సేపు గొడవ పడ్డాడు. అందుకు యువతి ఒప్పుకోలేదు. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌ వైపు రైలు దూసుకొస్తుండగా యువకుడు ఉన్మాదిలా మారాడు. యువతిని ఒక్కసారిగా రైలు కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో రైలు చక్రాల కింద పడి నలిగిన సత్య అక్కడిక్కడే మృత్యువాతపడింది. కూతురు మరణ వార్త విన్న సత్య తండ్రి మాణిక్యం గుండెపోటుతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె తల్లి ఆసుపత్రి పాలైంది.

యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్‌ గాంధీ హాస్పిటక్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా సత్యకు గత నెలలోనే మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది.  కాగా కొంత కాలంగా రైల్వే స్టేషన్‌లో ప్రేమ పేరిట యువతులపై వేధింపుల ఘటనలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
చదవండి: లవర్‌తో భర్త షికార్లు.. షాపింగ్‌ మాల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top