Video: బహిరంగంగానే మహిళా నేతను ముద్దు పెట్టుకున్న శివసేన ఎమ్మెల్యే?

Fact Check: Video of Shiv Sena MLA Prakash Surve Kissing Woman Leader - Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రకాష్‌ సర్వే చిక్కుల్లో పడ్డారు. దహిసర్‌లో ఆశీర్వాద్ యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ ర్యాలీలో పార్టీ మహిళా నేతను ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఎమ్మెల్యే..  పార్టీ అధికార ప్రతినిధి షీతల్‌ మ్హత్రేను బుగ్గ మీద ముద్దాడినట్లు కనిపిస్తుంది.

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ర్యాలీకి శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే, పార్టీ అధికార ప్రతినిధి శీతల్ మ్హత్రే హాజరయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్‌ వాహనం మీద ఉన్నారు. ఆయన పక్కనే షీతల్‌ నిలబడి ఉ‍న్నారు. ఉన్న​ట్టుండి ఎమ్మెల్యే రెండుసార్లు కిందకు వంగి మహిళా నేతను ముద్దు పెట్టుకున్నట్లు, ఆమె వైపు చూస్తూ నవ్వడం వీడియో ద్వారా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ వీడియోపై ఎమ్మెల్యే స్పందించారు. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో ఫేక్‌ అని తేల్చారు. తన పరువు తీసేందుకు, రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అంతేగాక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శివసేన నేతలు ముద్దుపెట్టుకుంటున్న వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354,509,500,34, 67 కింద దహిసర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుతో సంబంధమున్న ఇద్దరు నిందితులను 26 ఏళ్ల మానస్ కువార్, 45 ఏళ్ల అశోక్ మిశ్రాగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

అంతేగాక ఈ వ్యవహారంపై  శీతల్ మ్హత్రే  స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ’రాజకీయాల్లో ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేందుకు ఇంత నీచానికి దిగజారుతారా? ఇదేనా మీ సంస్కృతి? మాతోశ్రీ అనే ఫేస్‌బుక్‌ పేజీ నుంచి మార్ఫింగ్ చేసిన వీడియోని అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో మీకు బాలాసాహెబ్ సంస్కారం గుర్తుకు రాలేదా?’ అంటూ దుయ్యబట్టారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top