ఫేస్‌బుక్‌లో అన్‌ఫాలో కలకలం

Facebook users complain of losing followers - Sakshi

భారీగా పడిపోయిన ఫాలోవర్ల సంఖ్య

జుకర్‌బర్గ్‌కూ తప్పని తిప్పలు

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో బుధవారం ఉదయం నుంచి కొన్ని గంటల సేపు గందరగోళం నెలకొంది. ఫేస్‌బుక్‌ వినియోగదారుల ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రి అమాంతంగా పడిపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనూహ్యంగా భారీ సంఖ్యలో తమ ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోతున్నట్టు చాలా మంది వినియోగదారులు ఆందోళన చెందారు. దీనికి కారణాలు తెలీక గగ్గోలు పెట్టారు. చివరికి మెటా కంపెనీ వ్యవస్థపాకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కు తిప్పలు తప్పలేదు. జుకర్‌బర్గ్‌కు 11.9 కోట్ల మంది ఫాలోవర్లు ఉంటే ఏకంగా 10 వేలకు పడిపోవడంతో కలకలం నెలకొంది.

న్యూయార్క్‌ టైమ్స్, వాషింగ్టన్‌ పోస్ట్, యూఎస్‌ఏ టుడే వంటి అమెరికన్‌ మీడియా ఖాతాల ఫాలోవర్ల సంఖ్య పడిపోయింది. రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఫాలోవర్ల సంఖ్యపై ఆందోళన చెందుతూ ట్వీట్‌ చేశారు. ‘ఫేస్‌బుక్‌ సృష్టించిన సునామీతో తొమ్మిది లక్షల మంది ఉన్న నా ఫాలోవర్ల సంఖ్య కేవలం 9,000కు పడిపోయింది. జుకర్‌బర్గ్‌ ఫాలోవర్లు తగ్గిపోవడం మరీ విడ్డూరం’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఎందరో ప్రముఖుల ఫాలోవర్ల సంఖ్య పడిపోవడంతో ఫేస్‌బుక్‌ ప్రతినిధులు వినియోగదారులకు క్షమాపణలు చెప్పారు. సాయంత్రానికి అందరి ఖాతాల ఫాలోవర్లు సాధారణ స్థితికి చేరుకోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు.

ఎందుకిలా జరిగింది ?
ఫేస్‌బుక్‌లో ఫాలోవర్ల సంఖ్య పడిపోవడానికి మెటా సంస్థ ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ రకరకాల విశ్లేషణలు చేస్తూ నెటిజన్లు పలు పోస్ట్‌లు పెట్టారు. ఫేస్‌బుక్‌లో బాట్‌ అకౌంట్ల ప్రక్షాళనకు దిగడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ఈ బాట్‌ అకౌంట్ల సాయంతో ఆటోమేటిక్‌గా మెసేజ్‌లు పంపడం, ఫాలోవర్ల సంఖ్యను పెంచుకోవడం వంటివి చేయొచ్చు. వీటిని తొలగించే క్రమంలో సాంకేతిక లోపాలు తలెత్తి భారీ గందరగోళానికి దారి తీసిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఫేస్‌బుక్‌లో కొత్త ఆల్గారథిమ్‌ ప్రయోగించడంతో ఇలా జరిగిందనే అనుమానాలు కొందరు వ్యక్తంచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top