తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ అత్యవసరంగా ఓ లేఖ రాశారు. ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూనే.. పోలింగ్ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు.
ఎలక్షన్ టైంలో తమిళనాడులో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటేయాలనుకుంటున్నవాళ్లు బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు పట్టణ, నగరాల్లోనూ బస్టాండులలో పడిగాపులు పడుతున్నారు. కొయంబత్తూరులో జనం ఏకంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఈ పరిస్థితులన్నింటినీ విజయ్ తన లేఖలో ప్రస్తావించారు.
‘‘ఓటు వేసేందుకు తమిళనాడు ఓటర్లు పోటెత్తుతున్నారు. గంట గంటకు పెరుగుతున్న ఓటింగ్ శాతమే ఇందుకు నిదర్శనం. అయితే.. పూర్తిస్థాయిలో ఓటు వేయకుండా అడ్డుకునే కుట్ర కనిపిస్తోంది. సరిపడా బస్సులు లేక ఓటర్లు అవస్థలు పడుతున్నారు. చెన్నైలోని ప్రధాన టెర్మినల్స్ అని ప్రజలతో నిండిపోయాయి. పోలింగ్ బూత్‌లకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారు. వెంటనే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలి. ఓటు వేయాలన్న ఓటర్ల ఉత్సామంపై నీళ్లు చల్లొద్దు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ను మరో రెండు గంటలు పొడిగించండి’’ అని ఈసీని లేఖలో కోరారాయన.
— TVK Party HQ (@TVKPartyHQ) April 23, 2026
తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6గం.తో పోలింగ్ ముగియనుంది. అప్పటిదాకా క్యూ లైన్‌లో ఉన్న వాళ్లను మాత్రమే ఓటింగ్‌కు అనుమతించనున్నారు. అయితే బస్సుల కొరత కారణంగా విజయ్ ఆ సమయాన్ని 8గం. దాకా పొడిగించాలని ఈసీని కోరుతున్నారు.
తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు విజయ్. మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది ఆ పార్టీ. విజయ్ కూడా తిరుచురాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇదీ చదవండి: విజయ్.. ఆ సింప్లిసిటీ ఏమైంది?


