అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం
రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు
5.73 కోట్ల మంది ఓటర్లు.. 4,023 మంది అభ్యర్థులు
డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ
విజయం డీఎంకే కూటమిదేనంటున్న సర్వేలు
దళపతి విజయ్ పార్టీ 8–10 స్థానాలకే పరిమితం!
సాక్షి, చెన్నై: వరుసగా రెండోసారి విజయం దక్కించుకోవాలని ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్... ఐదేళ్ల క్రితం దూరమైన అధికారాన్ని తిరిగి హస్తగతం చేసుకోవడానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి... తొలి పోటీలోనే సత్తా చాటాలని సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు దళపతి విజయ్ తహతహలాడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధమయ్యింది.
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 234 స్థానాల్లో ఒకే విడతలో జరిగే ఓటింగ్‌లో 5.73 కోట్ల మంది ఓటర్లు 4,023 మంది అభ్యర్థుల తలరాతలను నిర్దేశించబోతున్నారు. ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) గణనీయమైన ప్రభావం చూపడం తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విజయ్ పార్టీ ఏ కూటమి ఓట్లను చీలుస్తుంది? లాభపడేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎన్నికల సర్వేలు స్టాలిన్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని అంచనా వేయడం గమనార్హం. డీఎంకే–కాంగ్రెస్ కూటమి 40.1 శాతం ఓట్లతో 181 నుంచి 189 స్థానాలు గెల్చుకోనున్నట్లు సర్వేలు తెలిపాయి. అన్నాడీఎంకే–బీజేపీ కూటమి 29 శాతం ఓట్లతో 38 నుంచి 42 సీట్లు సాధిస్తుందని వెల్లడించాయి. విజయ్ పార్టీ టీవీకే 23.9 శాతం ఓట్లతో 8 నుంచి 10 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశాయి.
యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో ప్రధాన పార్టీలు యువత ఓట్లపై గురిపెట్టినట్లు స్పష్టమవుతోంది. అధికారంలోకి వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చాయి. దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు రప్పిస్తామని పేర్కొన్నాయి. తమ ఎన్నికల ప్రణాళికలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోపాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. యువత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని వెల్లడించాయి. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇవ్వడం విశేషం.
దళపతి విజయ్ యువ ఓటర్లనే నమ్ముకున్నారు. ఆయన సభలకు యువత పోటెత్తారు. విజయ్ అభిమానుల్లో యువత, మహిళలు అధికంగా ఉండడం ఆయనకు అనుకూలాంశంగా మారింది. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 చొప్పున అందజేస్తామని విజయ్ హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం పలు పథకాలు ప్రకటించారు. యువతకు చేరువకావడానికి పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశాయి.
తొలిసారి ఓటర్లు 14.59 లక్షల మంది
అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చివరి నిమిషంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు నిఘా ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మొత్తం 5.73 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2.93 కోట్ల మంది మహిళలు, 2.83 కోట్ల మంది పురుషులు, 7,728 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అర్చనా పటా్నయక్ తెలిపారు.
14.59 లక్షల మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటు వేయబోతున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75,064 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోసం 1,06,418 బ్యాలెట్ యూనిట్లు, 75,064 కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు.
ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే ఓటింగ్‌లో జాప్యం జరగకుండా అదనపు యంత్రాలను సమకూర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 249 మోడల్ పోలింగ్ స్టేషన్లు, పూర్తిగా మహిళలే నిర్వహించే 325 పింక్ స్టేషన్లు, దివ్యాంగులు నిర్వహించే 71 పోలింగ్ స్టేషన్లు, యువత నిర్వహించే 29 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంచేశారు.
83,875 మంది స్థానిక పోలీసులతోపాటు 300 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించినట్లు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలను చాలావరకు అరికట్టామని, ఇప్పటిదాకా స్వా«దీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.1,262 కోట్లకు చేరిందని, అందులో నగదు, ఇతర సామగ్రి విలువ రూ.543 కోట్లు అని అర్చనాపట్నాయక్ తెలియజేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు పేర్కొన్నారు.
విదేశాల నుంచి రాక
తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. గత రెండు రోజుల్లో చెన్నై, కోయంబత్తూరు, తిరుచ్చి విమానాశ్రయాలకు పది వేల మందికి పైగా తరలిరావడం విశేషం. ఓటింగ్ ప్రక్రియను స్వయంగా తిలకించడానికి కొందరు విదేశీయులు సైతం వచ్చారు.


