ఇది ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’
యురోపియన్ కమిషన్
అధ్యక్షురాలు ఉర్సులా వ్యాఖ్య
న్యూఢిల్లీ: గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికాతో విబేధించిన యురోపియన్ యూనియ న్ దేశాలు, రష్యా చమురు విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో పేచీలు పెట్టుకున్న భారత ప్రభుత్వం చివరకు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, ఐరోపా సమాఖ్య నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా వడివడిగా అడుగులువేస్తున్నామని యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయన్ మంగళవారం ప్రకటించారు.
ప్రపంచ ఆర్థిక సదస్సు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి విచ్చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. భారత్‌తో ట్రేడ్ డీల్ పురోగతి వివరాలను వెల్లడించారు. 200 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, ఈయూ తీవ్రంగా కృషిచేస్తున్నాయి. వృద్ధి కేంద్రాలుగా, ఈ శతాబ్దపు ఆర్థికశక్తులుగా ఉన్న దేశాలతో వాణిజ్యం చేసేందుకు యూరప్ ఉవ్విళ్లూరుతోంది. అందుకే నేను, యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ఈనెల 25 నుంచి మూడ్రోజులపాటు భారత్‌లో పర్యటిస్తాం.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటాం. తర్వాత ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు జరుపుతాం. సంప్రతింపులపై జనవరి 27న ఒక కీలక ప్రకటన చేయబోతున్నాం. వాణిజ్య ఒప్పందంపై ఇంకా కొంత పని పూర్తిచేయాల్సి ఉంది. ఈ ఒప్పందాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందం( మదర్ ఆఫ్ ఆల్ డీల్స్)గా పిలుస్తున్నారు. 200 కోట్ల మందికి ప్రయోజనం చేకూరబోతోంది. ఇది ప్రపంచ జీడీపీలో 25 శాతానికి సమానం’’అని ఆమె అన్నారు.


