
న్యూఢిల్లీ: ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించాలని కోరే నిబంధనను దుర్వినియోగం చేయకుండా ఎన్నికల సంఘం(ఈసీ) ఈ–ధ్రువీకరణను అందుబాటులోకి తెచ్చింది. ఓటరు జాబితాలోని పేర్లను తొలగించడం లేదా పేర్లను చేర్చడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసే వారికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డు(ఓటీపీ) అందేలా ఈసీ కొత్త విధానం తీసుకువచ్చింది.
‘ఓటరు జాబితాలో ఉన్న ఒక పేరును తొలగించాలంటూ ఆన్‌లైన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసేవారు వేరే వ్యక్తుల పేరు/ ఫోన్ నంబర్‌ను ఇస్తున్నారు. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఫీచర్‌తో ఇలాంటి దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’అని ఓ అధికారి తెలిపారు. ఈ వెసులుబాటును వారం క్రితమే జత చేశామన్నారు. కర్నాటకలో అలండ్ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లను తొలగించారంటూ వచ్చిన ఆరోపణలకు స్పందనగా మాత్రం కాదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఓటరు జాబితా నుంచి పేరు తొలగించాలని ఫామ్–7ను ఆన్‌లైన్‌లో నింపినంత మాత్రాన ఆటోమేటిక్‌గా పేరు తొలగించడం జరగదన్నారు.
అలండ్ నియోజకవర్గంలో పేరు తొలగించాలంటూ ఫామ్–7 దరఖాస్తులు 6,018 అందాయని ఈసీ తెలిపింది. వీటిలో 24 దరఖాస్తులను మాత్రమే సరైనవిగా గుర్తించి, పేర్లను తొలగించామని, మిగతా వాటిని తిరస్కరించామని వివరించింది. కాగా, తాను ఓటు చోరీ ఆరోపణలు చేశాకనే కొత్తగా ఈ–వెరిఫికేషన్‌ను తీసుకువచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఈసీని విమర్శించారు. అలండ్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను కర్నాటక సీఐడీకి ఎప్పుడు అందజేస్తారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఆయన ప్రశ్నించారు.