
డూప్లికేట్ ఓటర్ ఐడీ నంబర్లపై ఈసీ
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్(ఎపిక్) సంఖ్యలు పునరావృతం కావడం వివాదాస్పదమైన నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ)మరోసారి స్పష్టత ఇచ్చింది. 2000వ సంవత్సరం నుంచి కొనసాగుతున్న ఈ వ్యవహారానికి వచ్చే మూడు నెలల్లో ముగింపు పలుకుతామని శుక్రవారం తెలిపింది. ఓటరు జాబితాలో పేరున్న వ్యక్తి ఎపిక్ సంఖ్యతో నిమిత్తం లేకుండా సంబంధిత పోలింగ్ కేంద్రంలోనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశముంటుందని, ఇతర పోలింగ్ బూత్‌లలో ఓటేసే అవకాశం ఆ వ్యక్తికి ఉండదని కూడా ఈసీ స్పష్టతనిచ్చింది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటరు జాబితాను తయారు చేస్తుండటం వల్లే ఇలా నంబర్లు పునరావృతమయ్యాయని వివరించింది. నమోదైన 99 కోట్లకు పైగా ఓటర్లతో భారత ఓటర్ల జాబితా ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ అని ఒక ప్రకటనలో ఈసీ పేర్కొంది. రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులు, సాంకేతిక నిపుణుల సాయంతో దశాబ్దాల నాటి ఈ అంశంపై మూడు నెలల్లో స్పష్టత తెస్తామంది. ప్రస్తుత ఓటర్లకు యూనిక్ నేషనల్ ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తామని, కొత్తగా నమోదయ్యే వారికి సైతం ఈ విధానాన్ని వర్తింపజేస్తామని వివరించింది. దీనివల్ల నంబర్లు పునరావృతమయ్యే అవకాశం ఉండదని తెలిపింది.