
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించిన తర్వాతే డీఎస్సీని నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయలేమని పేర్కొంది. ఏటా రెండుసార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గతేడాది అక్టోబర్‌లో నిర్వహించారని, ఆరునెలల్లో మరోసారి నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించడం వల్ల తమకు నష్టం జరుగుతుందని దేవిరెడ్డి దుర్గాశ్రీను, పి.హేమంత్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం శుక్రవారం విచారించింది. వాదనలు విన్న అనంతరం.. డీఎస్సీ అనేది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. ఇలాంటి అంశాల్లో పిటిషన్లు హైకోర్టులోనే దాఖలు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.