నాదంటే నాదే.. కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్‌

DNA Test For Pet Dog In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : భారత్‌లో డీఎన్‌ఏ టెస్ట్‌ అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే చేస్తుంటారు. వారసత్వం విషయంలో కుటుంబ పరమైన విభేదాలు వచ్చిప్పుడు అసలైన వారసుడు ఎవరో తెలుసుకోవాడనికి ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అతడు నా తండ్రే కావాలంటే డీఎన్‌ఏ టెస్ట్‌ చేసుకోండి అంటూ కొందరు మీడియా ముందుకు వచ్చిన సందర్భాలనూ చూశాం. కానీ ఆశ్చర్యకరంగా ఓ పెట్‌డాగ్‌ (పెంపుడు కుక్కకు) డీఎన్‌ఏ టెస్ట్‌ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన అరుదైన కేసు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌కు చెందిన ఇద్దరి వ్యక్తుల మధ్య కుక్క విషయంపై వివాదం ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం చివరికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాల్సి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న సాహెబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి తమ కుక్క గత కొన్నిరోజులుగా కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్తీక్‌ శివ్‌హారే అనే ఏబీవీపీ నేత సైతం ఇదే తరహా ఫిర్యాదు చేశారు. ఇద్దరి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు.. కుక్క కోసం వెతకడం ప్రారంభించగా అచూకీ లభించింది. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. ఆ కుక్కను ఎవరికి అప్పగించాలి అనేది తలనొప్పిగా మారింది. దీనిపై ఇరు వర్గాలను పిలిపించగా.. ఆ కుక్క తమదంటే.. తమదేఅంటూ వాదించడం ప్రారంభించారు. మొదట ఫిర్యాదు చేసిన సాహెబ్‌ ఖాన్‌ ఆ కుక్క వివరాలను వెల్లడిస్తూ.. మూడు నెలల క్రితం ఆ కుక్కను ఫలానా వ్యక్తి దగ్గర కొనుగోలు చేశానని, దాని పేరు కోకోగా పెట్టుకున్నాని వివరించారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించాడు. మరోవైపు కార్తీక్‌ కూడా ఈ కుక్క తనదేఅని గట్టిగా చెప్పారు. నాలుగు నెలల కిత్రం ఓ వ్యక్తి వద్ద కొన్నానని, దాని పేరు టైగర్‌ అని చెప్పారు. ఆ కుక్క తల్లి వివరాలను కూడా వెల్లడించారు. అయితే ఆ కుక్క మాత్రం కోకా అని పిలిచినా, టైగర్‌ అని పిలిచినా స్పందించడం పోలీసులతో పాటు ఇద్దరు యజమానులను ఆశ్యర్యానికి గురిచేసింది.

ఇక చేసేదేమీ లేక.. చివరికి పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్‌ చేసి  దాని తల్లి వివరాలు తెలుసుకుంటే అసలైన యజమాని ఎవరనేది తెలుసుకోవడం సులభమవుతుందని భావించారు. దీనిపై స్థానిక ఎస్పీ మాట్లాడుతూ. కుక్కపై తాము బాధ్యతగా ఉన్నామని, పరీక్ష అనంతరం అసలైన యజమానికి అప్పగిస్తామన్నారు. అయితే ఈ కుక్క చివరికి ఎవరికి దక్కుతుందన్న విషయం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు ఈ కేసుపై జంతు హక్కుల పరిరక్షణ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మూగజంతువుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని, వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top