2025లోనే పంచముఖి ఆలయ అర్చకుడు శ్యామాచారి జోస్యం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఖచ్చితంగా బాధ్యతలు చేపడతారని ఆనాడే జోస్యం చెప్పామని గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం అర్చకుడు శ్యామాచారి గుర్తుచేశారు గతంలో ఈ ఆలయాన్ని సందర్శించిన నేతల్లో నలుగురు సీఎం పీఠాన్ని అధిరోహించారన్నారు.
మంగళవారం రాయచూరు తాలూకా పంచముఖి గాణదాళ ఆంజనేయ ఆలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది అక్టోబరులో రాయచూరు జిల్లా పర్యటనలో భాగంగా గాణదాళ పంచముఖి ఆంజనేయ స్వామికి శివకుమార్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా.. గాణదళ పంచముఖీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. మధ్వమతాచార్యుడు గురు రాఘవేంద్రస్వామి ఇక్కడే 16 సంవత్సరాలు తపస్సు చేసి, పంచముఖీ హనుమంతుడిని ప్రసన్నం చేసుకున్నట్లు చెబుతారు. త్రేతాయుగంలో.. రామ-రావణ సంగ్రామం సమయంలో.. రామలక్ష్మణులను మైరావణుడు అపహరించి, పాతాళానికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే..! వారిని కాపాడేందుకు హనుమంతుడు గాణదళ నుంచే పాతాళానికి వెళ్లినట్లు స్థానికులు చెబుతారు. మైరావణుడి ప్రాణం అయిదు భ్రమరాల్లో ఉండడంతో.. వాటిని ఏకకాలంలో చంపేందుకు హనుమంతుడు పంచముఖీ ఆంజనేయస్వామి అవతారమెత్తినట్లు చెబుతారు. ఇక్కడ హనుమంతుడి కోసం కుట్టే భారీ తోలుచెప్పులు ప్రతీ ఐదేళ్ల కోసారి అరిగిపోవడం విశేషం.


