బెంగళూరు: బీజేపీ, జేడీఎస్ నాయకులను విమర్శిస్తూ బిడది పరిసర గ్రామాల్లో గోడలమీద పోస్టర్లు వెలిశాయి. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, నిఖిల్, అనితా కుమారస్వామిల ఫోటోలు వేసి.. బిడదిలో మాకు 100 ఎకరాల భూమి మాత్రమే ఉంది..ఆ భూమి మాకు వదిలేయండి.. అనితక్క.. నేను వినయ్ గౌడ.. మీ ఆస్తులకు బినామిని అని రాసి ఉంది. బిరియాని అడ్డా నారాయణస్వామి, రైతుల భూములు లాక్కున్న దొంగ, బీజేపీ నేత ఆర్.అశోక్ అని పోస్టర్లు వేశారు.
సీఎం డీకేపై కుమారస్వామి ధ్వజం
శివాజీనగర: ఈ ప్రచారాన్ని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఖండించారు. తాము బిడది రైతుల కోసం పోరాడుతుంటే కొందరు దు్రష్పచారం చేస్తున్నారని అన్నారు. సీఎం డీ.కే.శివకుమార్ పాత అలవాట్లు వదలలేదని పరోక్షంగా పోస్టర్లు ఆయన పనేనని విమర్శించారు. డీకే ముఖ్యమంత్రి అయిన తరువాత బ్లూ ఫిల్మ్‌లు చేయడం, పోస్టర్లు అతికించడం వదిలేస్తాడని అనుకున్నాను, కానీ ఆ అలవాటును మానుకోలేదు అని మండిపడ్డారు. నా భార్య ఫోటోను పోస్టర్‌లో వేశారు, 100 ఎకరాలు అని రాశారు, అక్కడ మాకు ఉండేది 46 ఎకరాలు మాత్రమే, ఇంక ఏ భూమి లేదు అని చెప్పారు.


