వీడియో: కలెక్టర్‌ ‘జొమాటో’ వ్యాఖ్యల దుమారం.. వరద బాధితులపై అసహనం

UP District Magistrate Zomato Comments With Flood Victims Viral - Sakshi

వైరల్‌: వరద బాధితులను ఉద్దేశించి ఓ జిల్లా కలెక్టర్‌ చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.  ప్రభుత్వం ఉంది ప్రజాసేవ చేయడానికేనని అంతేగానీ జొమాటో సర్వీస్‌ నడపడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడంతో.. ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తక్షణ సహాయక చర్యలు అందించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశించారు. అంబేద్కర్‌ నగర్‌ జిల్లాలో గత పదిరోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ క్రమంలో ఘగ్హర నది ఉప్పొంగి.. పలు గ్రామాలు వరద నీట మునిగాయి. ఈ క్రమంలో ముంపు గ్రామాల ప్రజలను ఒక చోట చేర్చి మాట్లాడారు జిల్లా కలెక్టర్‌ శామ్యూల్ పాల్. 

ప్రభుత్వం మీ అందరి కోసం వరద సహాయ శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ఉండాలని కోరింది కూడా. ఇక్కడ మీ అందరికీ క్లోరిన్‌ మాత్రలు అందిస్తారు. ఏమైనా సమస్యలు తలెత్తితే డాక్టర్లు వచ్చి చూస్తారు. అందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాం కూడా. కానీ, మీరంతా ఇంట్లో ఉంటే ఎలాగా? తిండిని ఇంటికే పంపాలని అనుకుంటున్నారా? ప్రభుత్వం ఏమైనా మీకోసం జొమాటో సర్వీస్‌ నడిపిస్తుందని అనుకుంటున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

అయితే వరద బాధితులను ఉద్దేశించి కలెక్టర్‌ అలా మాట్లాడాల్సింది కాదంటూ ఇంటర్నెట్‌లో మండిపడుతున్నారు కొందరు నెటిజన్స్‌. మరికొందరు మాత్రం ఆ అధికారి అన్నదాంట్లో తప్పేం లేదని, గ్రామస్తులు ఇళ్లలో ఉండడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top