ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం.. హుటాహుటిన రంగంలోకి ప్రభుత్వం

Delhi Pollution: Air Quality Falls To Years Worst As Farm Fires - Sakshi

దారుణంగా గాలి నాణ్యత

పులిపై పుట్రలా పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాల కాల్చివేత

ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌ కల్పించాలని కంపెనీలకు సూచన

సాక్షి, న్యూఢిల్లీః  దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీ రైతులు పంట వ్యర్థాలను కాల్చేస్తుండటంతో ఆ పొగంతా ఢిల్లీని దట్టంగా కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. బుధవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 354 (వెరీ పూర్‌)గా నమోదైంది. నోయిడాలో 406కి పడిపోయింది.

మంటలు రేపుతున్న కాలుష్యం...
పంజాబ్‌లో సెప్టెంబర్‌ 15–నవంబర్‌ 1 మధ్య గతేడాదిని మించి 17,846 వ్యవసాయ వ్యర్థాల కాల్చివేతలు జరిగాయి. బుధవారం సైతం పంజాబ్‌లో 1,880 చోట్ల పంట వ్యర్థాల కాల్చివేత సాగింది! వీటిని నియంత్రించాలని ఢిల్లీ ప్రభుత్వం పొరుగు కోరుతున్నా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌ మరియు నోయిడా వంటి ఢిల్లీకి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రాంతీయ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని యూపీ, హరియాణా ప్రభుత్వాలను ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ అభ్యర్థించారు. కాలుష్య సమస్య రాష్ట్ర సమస్య కాదని, అభివృద్ధి చెందుతున్న వాయు వ్యవస్థ కారణంగా ఇది జరుగుతోందని, దీని కట్టడికి ఉమ్మడి సహకారం అవసరమని రాయ్‌ పేర్కొన్నారు.  

కార్మికులకు భృతి
వాయుకాలుష్యం తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీలో అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలపై పూర్తి నిషేధం అమల్లోకి వచ్చింది. నిషేధ సమయంలో ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5 వేలు అందించాలని సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ నిర్ణయించారు. ఇక కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగులు వీలునుబట్టి వర్క్‌ ఫ్రం హోమ్‌ పనిచే యాలని, ప్రైవేట్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని రాష్ట్ర మంత్రి గోపాల్‌రాయ్‌ ప్రజలను కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top