లాక్‌డౌన్‌ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత?

Delhi Pollution Air Quality Degrades to Very Poor - Sakshi

పండుగల సీజన్‌లో ఢిల్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఢిల్లీ ప్రజలు గాలి పీల్చుకోవడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ వాయు నాణ్యత సూచీ తాజాగా 302కి చేరుకుంది. ఢిల్లీలో సగటు ఎయిర్‌ క్వాలిటీ సూచీ(ఏక్యూఐ) 200 నుండి 300 మధ్య ఉంటుంది. రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరింత దిగజారుతోంది. 

దీపావళికి ముందే ఢిల్లీ పరిస్థితి ఇలాగే ఉంటే, ఈ పండుగ తరువాత పరిస్థితి మరింత దిగజారనుంది. మొన్న ఆదివారం ఉదయం ఢిల్లీ ఏక్యూఐ 266గా ఉంది. శనివారం ఈ సంఖ్య 173గా ఉంది. సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (ఎస్‌ఏఎఫ్‌ఏఆర్‌) తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ  మధ్యాహ్నానికి 330కి చేరుకుంటోంది. ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్ తప్పదని నిపుణులు అంటున్నారు.  

ఢిల్లీ వాతావరణం మరింత దిగజారుతుండటంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన వ్యక్తం చేసింది. జనం ప్రైవేట్ వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించాలని అధికారులు  సూచిస్తున్నారు. పార్కింగ్‌ ఫీజులు పెంచాలని, ఎలక్ట్రిక్‌ బస్సులు, మెట్రో సర్వీసులను పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్‌ఏపీ) కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగితే, నూతన ఆంక్షలు విధించే అవకాశముందని సమాచారం. 

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కాలుష్యం స్టేజ్-3కి చేరుకుంటే, బీఎస్‌-III, బీఎస్‌-IV వాహనాలను నిషేధించవచ్చు. అత్యవసర సేవల వాహనాలపై కూడా పరిమితులు విధించే అవకాశముంది.  రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, ఆసుపత్రులు, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులను అధికారులు నిలిపివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలుష్య పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటే హైవేలు, రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్లు, పైప్‌లైన్ల పనులు కూడా నిలిచిపోనున్నాయి. విద్యాసంస్థలను కూడా మూసివేసే అవకాశాలున్నాయి. వాహనాలకు సంబంధించి బేసి-సరి ఫార్ములా తిరిగి అమలు చేసే అవకాశముంది. అలాగే ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పని చేసేవిధంగా అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే కొన్ని సంస్థలలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఇందిర ‘మూడవ కుమారుడు’ ఎవరు?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top