Delhi Police: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాల కోసమే..

Delhi Police Reach Rahul Gandhi Residence - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ జనవరి 30న శ్రీనగర్‌లో భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు మరోసారి స్పందించారు. సదరు బాధిత మహిళల నుంచి ఫిర్యాదు స్వీకరించడంతోపాటు రక్షణ కలి్పంచడానికి వీలుగా వారి వివరాలు తెలుసుకొనేందుకు ఆదివారం ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ ఇంటికి వెళ్లారు. ప్రత్యేక కమిషనర్‌ సాగర్‌ప్రీత్‌ హుడా నేతృత్వంలో పోలీసుల బృందం ఉదయం పదింటికి తుగ్లక్‌ రోడ్డులోని రాహుల్‌ ఇంటికి వెళ్లినా ఆయన్ను కలవలేకపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి వెళ్లిపోయింది. ఢిల్లీ పోలీసులు రాహుల్‌ గాంధీ ఇంటికి రావడం ఇటీవల ఇది మూడోసారి. ‘లైంగిక వేధింపులకు గురవుతున్నామంటూ మిమ్మల్ని వేడుకున్న మహిళల వివరాలు తెలపండి’ అంటూ రాహుల్‌కు ప్రశ్నావళితో నోటీసు పంపించారు.

తీవ్రమైన ఆరోపణలు చేశారు
రాహుల్‌ ఇంటికి పోలీసుల వచ్చారన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పవన్‌ ఖేరా, అభిషేక్‌ సింఘ్వీ, జైరాం రమేశ్‌ తదితరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలపై స్థానికంగా దర్యాప్తు జరిపామని, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినట్లు, సమస్యను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు నిర్ధారణ కాలేదని ప్రత్యేక కమిషనర్‌ సాగర్‌ప్రీత్‌ హుడా చెప్పారు. ‘‘రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. త్వరలో తానే స్వయంగా ఆయనను కలిసి, వివరాలు తెలుసుకుంటా’’ అని చెప్పారు.

అదానీపై ప్రశ్నిస్తున్నందుకే: రాహుల్‌
తన ఆరోపణపై రాహుల్‌ ఆదివారం సాయంత్రం 4 పేజీల్లో ప్రాథమిక ప్రతిస్పందనను పోలీసులకు పంపించారు. గౌతమ్‌ అదానీ అంశంలో పార్లమెంట్‌ లోపల, బయట కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశి్నస్తున్నందుకే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటనలపై కూడా ఇలాంటి శల్యపరీక్ష చేశారా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఆరోపణలపై పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వడానికి 8 నుంచి 10 రోజుల సమయం కోరారు.

కుట్రపూరితంగానే
ఢిల్లీ పోలీసులు రాహుల్‌ ఇంటికి వెళ్లడాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. దీని వెనుక రాహుల్‌ను వేధించి, బెదిరించే కుట్ర ఉందని పార్టీ నేతలు అశోక్‌ గహ్లోత్, జైరాం రమేశ్, అభిషేక్‌ సింఘ్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చేసే ప్రకటనలపై కేసులు నమోదు చేసే దుష్ట సంస్కృతికి మోదీ సర్కారు తెరతీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీయేతర పారీ్టల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చేసే ప్రకటనలపై ఇకపై ఇలాంటి కేసులు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకుల విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందించారు. పోలీసులు వారి విధులను వారు నిర్వర్తించారని, ఇందులో తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చిచెప్పారు. చట్టప్రకారమే వారు నడుచుకున్నారని తెలిపారు.

చదవండి: శిండే వర్గంతో కలిసే పోటీ! అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ..

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top