ఢిల్లీ మేయర్‌ ఎన్నిక.. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన ఆప్‌

Delhi Mayor Election AAP Goes To Supreme Court  - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది ఇవాళ. ఆమ్‌ ఆద్మీ పార్టీ మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మేయర్‌ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడడం, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆప్‌ రగిలిపోతోంది. 

ఈ క్రమంలో.. నిర్ణీత సమయంలోపు ఎన్నిక నిర్వహించేలా ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ను న్యాయస్థానం ఆదేశించాలని కోరుతూ ఆప్‌ మేయర్‌ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్‌ ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాదు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లకు ఓటింగ్‌ అర్హత లేదని.. అది చట్టవిరుద్ధమని.. కాబట్టి, వాళ్లను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరింది ఆప్‌. శుక్రవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం​ ఉంది. 

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు కిందటి నెలలోనే జరగ్గా.. ఫలితాలు ఆప్‌కు అనుకూలంగా వచ్చాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఎంసీడీకి కిందటి నెల(డిసెంబర్‌లో) ఎన్నిక జరిగింది. ఫలితాల్లో ఆప్‌ 134, బీజేపీ 104 సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్‌ మరీ ఘోరంగా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. దీంతో పదిహేనేళ్ల తర్వాత మేయర్‌ పీఠానికి బీజేపీ దూరమైనట్లు కనిపించింది. 

మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల బరి నుంచి బీజేపీ తప్పుకోవడంతో మెజారిటీ ఉన్నందునా ఆప్‌ నుంచి షెల్లీ ఒబెరాయ్‌ మేయర్‌గా, ఆప్‌ అభ్యర్థే డిప్యూటీ మేయర్‌ కావడం ఖాయమని తొలుత అంతా భావించారు. అయితే బీజేపీ మాత్రం బరిలోకి దిగి పెద్ద ట్విస్టే ఇచ్చింది. జనవరి 6వ తేదీన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా.. కార్పొరేటర్ల రసాభాసతో ఎన్నిక వాయిదా పడింది. తిరిగి.. 24వ తేదీన ఎన్నిక నిర్వహించాలని యత్నించగా మళ్లీ అదే సీన్‌ రిపీట్‌ కావడంతో తదుపరి తేదీకి హౌజ్‌ను వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు.

ఇదిలా ఉంటే ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ నియామకం విషయంలోనూ ఆప్‌, బీజేపీల నడుమ పెద్ద విమర్శల పర్వమే కొనసాగింది. కార్పొరేటర్లలో సీనియర్‌ అయిన ముఖేష్‌ గోయల్‌ పేరును ఆప్‌ ప్రతిపాదించినప్పటికీ.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాత్రం బీజేపీ అభ్యర్థి సత్య శర్మను ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా నియమించడం విశేషం. దీంతో ‘కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌ అయిన ఎల్జీ.. బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారంటూ’ ఆప్ మండిపింది.

ఈసారి మేయర్‌ పదవిని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎంసీడీ పరిధిలోని మూడు డివిజన్లు.. కిందటి ఏడాది ఢిల్లీ మున్సిపల్‌ విభాగం పరిధిలోకి వచ్చాయి. అందుకే భారీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని కీలకంగా భావిస్తున్నాయి ఇరు పార్టీలు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top