కరోనా విలయం: ఢిల్లీలో లాక్‌డౌన్‌

Delhi likely to impose Complete lockdown from tonight - Sakshi

దేశ రాజధానిలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి

25 వేలకు పైగా  రికార్డు  కేసుల నమోదు

ఏప్రిల్‌ 26 వరకు  ఢిల్లీలో లాక్‌డౌన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య దాదాపు 3 లక్షలకు చేరువలో ఉంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరంలో ఢిల్లీలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేపుతోంది. దీంతో ఆప్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విధించిన రాత్రి  కర్ఫ్యూని లాక్‌డౌన్‌గా మార్చింది. ఢిల్లీలో అత్యధికంగా ఒకే రోజు 25 వేలకుపైగా కొత్త కరోనా నమోదు కావడంతో శరవేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని నిలువరించేందుకు ఏప్రిల్‌ 26వ తేదీవరకు లాక్‌డౌన్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజల సహకారంతో మహమ్మారిని ఎదుర్కొంటామని, లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం రాదని భావిస్తున్నామని ఢిల్లీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సీఎం  ఢిల్లీలో నాలుగో వేవ్‌ కొనసాగుతోందని, పాజిటివ్‌ రేటు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.  రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలతో అన్ని రాష్ట్రాల కంటే ఢిల్లీలోనే పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే ఐసీయూ బెడ్స్‌ నిండిపోయాయి. ఆ‍క్సిజన్‌  కొరత వేధిస్తోందని ఆయన తెలిపారు. దీనికి తోడు రోజులు 25వేలకు పైగా కేసులు రావడంతో చికిత్స అందించడం కష్టంగా మారిందన్నారు. రోజువారీ కరోనా కేసులు, మరణాల పెరుగుదల నేపథ్యంలో దేశ రాజధానిలో 7 రోజుల పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు కేజ్రీవాల్‌ ప్రకటించారు. కష్టమైనా లాక్‌డౌన్‌ తప్పలేదని, కానీ వలస కార‍్మికులు ఇక్కడే ఉండాలని సూచించారు.  ఇది చిన్న లాక్‌డౌన్‌ మాత్రమే..దయచేసి ఎక‍్కడికీ వెళ్లకండి..ఆందోళన చెందకండి.. ప్రభుత్వం మిమ్మల్నిఆదుకుంటుంది అంటూ జోతులు జోడించి మరీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కేవలం 50మందితో వివాహాలు జరపవచ్చు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి. ఇందుకోసం విడిగా పాస్‌లు జారీ చేయబడతాయనీ, త్వరలో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు.

రాజధానిలో భయంకరమైన కోవిడ్‌​-19 పరిస్థితి, లాక్‌డౌన్‌ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ సీఎ కేజ్రీవాల్ సోమవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశం అనంతరం  ఈ  ప్రకటనను విడుదల చేశారు. అన్ని ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం పనిచేయనున్నారు. అయితే, అవసరమైన సేవలకు పరిమితుల నుండి మినహాయింపు ఉండనుంది.  కాగా గతవారం ఏప్రిల్ 16 రాత్రి 10 గంటల నుండి ఏప్రిల్ 19 ఉదయం 6 గంటల వరకు జాతీయ రాజధానిలో వారాంతపు కర్ఫ్యూను ప్రకటించారు. ఏప్రిల్ 30 వరకు మాల్స్, వ్యాయామశాలలు, ఆడిటోరియంలను మూసివేస్తున్నట్టు ఆప్‌ సర్కార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో 25,462 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 161 మరణాలు నమోదయ్యాయి.  దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో  2,73,810గా ఉండగా, 1,619 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top