విల్లు రాయకున్నా.. తండ్రి ఆస్తిలో వాటా హక్కు ఆడబిడ్డకు: సుప్రీం కీలక తీర్పు

Daughters To Inherit Father Property Even Though No Will Says SC - Sakshi

న్యూఢిల్లీ: ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని కీలక తీర్పు ఇచ్చింది గురువారం.

హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ, భర్త చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే అతని ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే..  భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది.


ప్రతీకాత్మక చిత్రం

మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది.

తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్‌ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్‌ డేట్‌ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్‌.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం.

చదవండి: ఎన్నికల్లో సమోసా-చాయ్‌ నుంచి బీఎండబ్ల్యూ వరకు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top