ఉచిత పథకాలు దేశానికి ప్రమాదకరం

Culture of freebies for votes dangerous says PM Narendra Modi - Sakshi

ఈ సంస్కృతిని వీడినప్పుడే అభివృద్ధి

బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను

ప్రారంభించిన ప్రధాని మోదీ

జలౌన్‌: ఉచిత పథకాల ద్వారా ఓట్లు దండుకునే సంస్కృతి దేశం అభివృద్ధికి చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ అన్నారు. ఇటువంటి తాయిలాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన హెచ్చరించారు. యూపీలో రూ.14,850 కోట్లతో నిర్మించిన 296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేను జలౌన్‌ జిల్లా కైతెరి గ్రామం వద్ద శనివారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఈ రహదారితో వాహనాల వేగం మాత్రమే కాదు, బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని చెప్పారు. చిత్రకూట్‌– ఢిల్లీ మధ్య ప్రయాణ కాలం మూడు నుంచి నాలుగు గంటలు తగ్గుతుందని కూడా చెప్పారు. ‘‘మన దేశంలో రేవడీ(ఉత్తర భారతంలో ఒక స్వీట్‌ పేరు)లు పంచుతూ ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేవడీలతో ప్రజలను కొనుగోలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఈ సంస్కృతి దేశం అభివృద్ధికి ప్రమాదకరం. 

రేవడీ సంస్కృతితో కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఎయిర్‌పోర్టులు, డిఫెన్స్‌ కారిడార్‌లు రావు. ఈ సంస్కృతిని దేశ రాజకీయాల నుంచి పారదోలినప్పుడే కొత్త రహదారులు, కొత్త రైలు మార్గాలు నిర్మించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చవచ్చు’’అంటూ ఎన్నికల సమయంలో ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీలపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు సులువైన రేవడీ సంస్కృతిని వదిలి, రాష్ట్రాభివృద్ధికి తీవ్రంగా పాటుపడుతున్నాయని ప్రధాని చెప్పారు.  

దేశ అభివృద్ధికి పునాదులు: కేజ్రీవాల్‌
ఉచిత పథకాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న విద్య, ఆరోగ్యం, విద్యుత్‌ సౌకర్యాలు ఓట్లు గుంజే తాయిలాలు కావని తెలిపారు. మన దేశం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా నిలిచేందుకు పునాది వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top