కోవిడ్‌ ఆస్పత్రిలో అగ్నికీలలు

Covid-19 hospital fire in Ahmedabad leaves 8 patients dead - Sakshi

ఎనిమిది మంది రోగులు దుర్మరణం

అహ్మదాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రి ఐసీయూలో ప్రమాదం

విచారం వ్యక్తం చేసిన ప్రధాని

అహ్మదాబాద్‌: గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 8 మంది కోవిడ్‌–19 బాధితులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.6 లక్షల పరిహారం ప్రకటించాయి. నగరంలోని నవ్‌రంగ్‌పురా ప్రాంతంలోని శ్రేయ్‌ ఆస్పత్రి చివరి, నాలుగో అంతస్తులో గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

ఆ అంతస్తులోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్న ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఘటన జరిగిన సమయానికి వార్డులో 11 మంది రోగులున్నారని, ముగ్గురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన వార్డ్‌బాయ్‌ చిరాగ్‌ పటేల్‌ తెలిపాడు. ఈ క్రమంలో ఇతనికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే దిగువ జనరల్‌ వార్డుల్లో ఉన్న 41 మందిని సురక్షితంగా వేరే ఆస్పత్రికి తరలించారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నాలుగో అంతస్తులో చెలరేగిన మంటలు, క్షణాల్లోనే వార్డును చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రధాని సహాయ నిధి నుంచి కేంద్రం రూ.2 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు.. క్షతగాత్రులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.50 వేల చొప్పున పరిహారంగా ప్రకటించాయి. అహ్మదాబాద్‌లో కోవిడ్‌ చికిత్సకు యంత్రాంగం గుర్తించిన 60 ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో శ్రేయ్‌ ఒకటి. అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రూపానీకి ఫోన్‌ చేసి, ఘటన వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన శ్రేయ్‌ ఆస్పత్రిని సీజ్‌ చేయాలని సీఎం రూపానీ ఆదేశించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఇద్దరు ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ట్రస్టీల్లో ఒకరైన భరత్‌ మహంత్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top