మహిశాసురుడిలా గాంధీ.. దుర్గా మండపంలో విగ్రహంపై దుమారం

Controversy Over Durga Pandal With Gandhi Like Face - Sakshi

కోల్‌కతా: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కోల్‌కతాలో అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వివాదానికి కేంద్ర బిందువైంది. త్రిశూలంతో దుర్గామాత వధిస్తున్న మహిశాసురుడు.. గాంధీజీ రూపురేఖల్లో ఉండటమే ఇందుకు కారణం. బట్టతలతో, గుండ్రని కళ్లద్దాలతో ధోతీ ధరించినట్లు ఆ విగ్రహముంది. గాంధీజీని అవమానించాలనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇలాంటి విగ్రహాన్ని ప్రతిష్టించాయని పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌సహా పలు పార్టీలు తీవ్రంగా విమర్శించాయి.

అయితే, ఈ ఘటనను అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రచూర్‌ గోస్వామి సమర్థించుకున్నారు. ‘అసురుడి ముఖం అలా ఉండటం కేవలం యాదృచ్ఛికం. అయినా, ఆ బొమ్మ చేతిలో రక్షణ కవచం ఉంది. గాంధీజీ అవేం ధరించడుకదా. అయినా నేతాజీ, భగత్‌సింగ్‌లే నిజమైన హీరోలు. గాంధీజీని విమర్శించాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘ ఇదే బీజేపీ, సంఘ్‌ పరివార్‌ నిజమైన భావజాలం. మిగతాదంతా డ్రామా. మహాత్ముడిని ఇలా అవమానిస్తారా?’ అని టీఎంసీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కునాల్‌ ఘోష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయం తెల్సుకున్న పోలీసులు మండపానికి వెళ్లి రాక్షసుడి ముఖాన్ని మరో రూపంలోకి మార్చాలని నిర్వాహకులకు సూచించారు.
చదవండి: మంగళ్‌యాన్‌ కథ ముగిసింది

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top