‘సిద్ద రామయ్యే మా రాముడు.. అయోధ్య ఎందుకెళ్లాలి?’ | Sakshi
Sakshi News home page

Karnataka: ‘సిద్ద రామయ్యే మా రాముడు.. అయోధ్య ఎందుకెళ్లాలి?’

Published Tue, Jan 2 2024 1:01 PM

Congress Leader Compare Siddaramaiah with Lord Ram - Sakshi

కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నేత హెచ్ ఆంజనేయ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను శ్రీరామునితో పోల్చడం వివాదాస్పదంగా మారింది. రామాలయం విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని, మత ‍ప్రాతిపదికన దేశ ప్రజలను బీజేపీ విభజిస్తోందని కాంగ్రెస్ నేత ఆంజనేయ ఆరోపించారు. కాగా కాంగ్రెస్‌ నేత చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేత బదులిచ్చారు. 

హిందూ దేవుళ్లు, దేవతల గురించి ఆలోచించి మాట్లాడాలని బీజేపీ నేతలు హెచ్చరించారు. మీడియాతో మాట్లాడిన హెచ్‌ ఆంజనేయ నూతన రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య అయోధ్యకు వెళ్లే విషయమై ప్రస్తావించారు. ఆయన (సిద్దరామయ్య) మా రాముడు.. అటువంటప్పుడు అయోధ్యలో జరిగే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎందుకు వెళతారని అన్నారు. అతను తన స్వగ్రామంలోని రామ మందిరాన్ని సందర్శించడానికి వెళ్లగలరని అన్నారు. అక్కడ బీజేపీకి చెందిన రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు. బీజేపీ వాళ్లను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. మా రాముడు మా హృదయాల్లోనే ఉన్నాడు. బీజేపీ ఎప్పుడూ ఇలాంటి పనులనే చేస్తుంది. మతం పేరుతో ప్రజలను విభజించి, ఒక నిర్దిష్ట వర్గాన్ని రెచ్చగొట్టి, వారి ఓట్లను దక్కించుకుంటుందని ఆరోపించారు.

కాగా కాంగ్రెస్ నేత ఆంజనేయ వ్యాఖ్యలపై  బీజేపీ ఎదురుదాడికి దిగింది. బీజేపీ నేత బసనగౌడ పాటిల్ మాట్లాడుతూ..  కాంగ్రెస​్‌ నేతను ఉద్దేశించి హిందూ దేవుళ్ల గురించి ఆలోచించి మాట్లాడాలని అ‍న్నారు. ఇలాంటి హిందూ వ్యతిరేకులు మనకు మంత్రులు కావడం మన దురదృష్టం అంటూ ఘాటుగా విమర్శించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement