మా పోరాటం ఆగదు | Cockroach Janta Party Abhijeet Dipke vows to continue protests | Sakshi
Sakshi News home page

మా పోరాటం ఆగదు

Jun 8 2026 4:35 AM | Updated on Jun 8 2026 4:35 AM

Cockroach Janta Party Abhijeet Dipke vows to continue protests

ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి దిగిపోవాల్సిందే 

విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండా రూపొందిస్తాం 

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే వెల్లడి

ఛత్రపతి శంభాజీనగర్‌: జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకొనేదాకా తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో అభిజిత్‌ దీప్కే మీడియాతో మాట్లాడారు. 

దేశంలో గత 12 ఏళ్లుగా రాజకీయాలు కేవలం హిందూ–ముస్లిం ఎజెండా చుట్టూ తిరుగుతున్నాయని ఆక్షేపించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇప్పటికైనా మారాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసిన తర్వాత దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండాను రూపొందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఛత్రపతి శంభాజీనగర్‌లోని సొంత ఇంటికి చేరుకున్న అభిజిత్‌ దీప్కేకు ఘన స్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. 

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్న ప్రధాని మోదీ మన దేశంలో పేపర్‌ లీక్‌ను ఆపలేరా? అని దీప్కే ప్రశ్నించారు. జెన్‌ జెడ్‌ యువత ఎవరికీ భయపడబోరన్న సంగతి శనివారం నాటి జంతర్‌మంతర్‌ ధర్నాతో తెలిసిపోయిందన్నారు. తప్పులు జరిగితే యువత ప్రశ్నిస్తూనే ఉంటుందని ఉద్ఘాటించారు. ఈ ధర్నాకు 7,000 మంది హాజరయ్యారని, తమ ఉద్యమం ఇక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని స్పష్టంచేశారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ వల్ల లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎవరూ బాధ్యత తీసుకోకపోతే వ్యవస్థ సక్రమంగా ఎలా పనిచేస్తుందని ప్రశ్నించారు. దీప్కే ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇది ట్రైలర్‌ మాత్రమే  
జంతర్‌మంతర్‌ ధర్నా ఒక ట్రైలర్‌ మాత్రమేనని అభిజిత్‌ దీప్కే వ్యాఖ్యానించారు. ధర్నాకు హాజరైనవారికి ఆదివారం ‘ఎక్స్‌’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను 7 రోజుల్లోగా పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శనివారం జరిగిన ధర్నాకు చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలపై విద్యార్థులు, యువతలో పెరుగుతున్న ఆగ్రహాన్ని ఈ ధర్నా ఒక ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి ఒక ట్రైలర్‌ను చూపించిందని వివరించారు.  ప్రజలంతా కలిసికట్టుగా గళాన్ని వినిపించకపోతే వ్యవస్థలో ఆశించిన మార్పు రాదని తేల్చిచెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement