
సీఎం సిద్దు ప్రత్యేక భేటీలు
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళవారం నుంచి నాలుగు రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలకు శ్రీకారం చుట్టారు. పార్టీ బలోపేతం, నియామకాలు, నిధుల పంపిణీ, అభివృద్ధి పనులు తదితరాలే ఈ చర్చల అజెండా. తొలిరోజు మైసూరు, చామరాజనగర, తుమకూరు, కొడగు, హాసన్, దక్షిణ కన్నడ జిల్లాల ఎమ్మెల్యేలతో విధానసౌధలో భేటీ అయ్యారు.
ఒక్కొక్కరితో 10 నిమిషాల పాటు మాట్లాడినట్లు సమాచారం. ఇటీవలికాలంలో ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు సీఎం బుజ్జగింపులకు దిగారు. ఇప్పటికే ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గ పనులకు రూ.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారు.
సుర్జేవాలా ఎఫెక్టు
రాష్ట్ర ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇటీవల బెంగళూరులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో ఆంతరంగిక భేటీలు జరపడం తెలిసిందే. అభివృద్ధి పనులకు డబ్బు లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. సీఎం తమకు దొరకడం లేదని ఫిర్యాదు చేశారు. దీనివల్ల పారీ్టలో అగాథం ఏర్పడుతోందని భావించి వన్ టు వన్ భేటీలకు పెద్దపీట వేశారు.