న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడానికి వీల్లేకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ ప్రదేశాన్ని నిరసన వేదికల జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మండిపడింది. జంతర్ మంతర్‌ను నిరసనల వేదిక జాబితా నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ ఎక్స్‌లో స్పందిస్తూ... ‘కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని, ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. “ఆమోదయోగ్యం కాదు.. జంతర్ మంతర్‌ను చూసి నరేంద్ర మోదీ ఎందుకు భయపడుతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.
జంతర్ మంతర్ భారత ప్రజలకు చెందినదని పేర్కొన్న దాస్.. ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రజలను సంప్రదించిందా అని నిలదీశారు. సంబంధిత వర్గాలు, సంస్థల అభిప్రాయాలను తీసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రజలకు చెందిన జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగిస్తున్నట్లుగానే, త్వరలో ప్రధానమంత్రి భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ చర్య ఆ దిశగా వేసిన అడుగుగా అభివర్ణించారు.
నిరసన తెలిపే హక్కుపై దాడి
ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షమని, దీనిని తాము అంగీకరించబోమని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. నిరసన తెలిపే ప్రాథమిక హక్కుతో పాటు శాంతియుతంగా సమావేశమయ్యే హక్కుపై ఇది దాడి అని ఆరోపించారు. ప్రస్తుతం దేశమంతా జంతర్ మంతర్‌గా మారుతోందని వ్యాఖ్యానించారు. సీజేపీ కన‍్వీనర్ దీప్కే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ అక్టోబర్ 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నిరసనలు, ఆందోళనల కోసం రామ్‌లీలా మైదాన్, బురారీ మైదాన్, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌ను కొత్త వేదికలుగా గుర్తించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలు నిర్వహించేందుకు పిలుపులు రావడంతో దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
జంతర్ మంతర్‌ను నిరసనల వేదికగా తొలగించడంపై సీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో, ఈ అంశంపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో, నిరసనల నిర్వహణపై తదుపరి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
ఇదీ చదవండి: ఆర్థిక శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్


