కదం తొక్కిన కాక్రోచ్‌ | CJP Gets Nod To Hold Protest Demanding Education Minister Resignation | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కాక్రోచ్‌

Jun 7 2026 6:04 AM | Updated on Jun 7 2026 10:29 AM

CJP Gets Nod To Hold Protest Demanding Education Minister Resignation

విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలి  

ధర్మేంద్ర ప్రధాన్‌ వారంలోగా రాజీనామా చేయాలి

కాక్రోచ్‌ జనతా పార్టీ డిమాండ్‌... ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా  

ఇతర రాష్ట్రాల నుంచీ పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం  

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే  

ఎవరికీ భయపడబోమని స్పష్టీకరణ  

ఇది దీర్ఘకాల పోరాటం... అన్నింటికీ సిద్ధపడే వచ్చానని వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, నీట్‌(యూజీ)లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారులు శనివారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ధర్నాకు భారీ స్పందన లభించింది. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియా ప్రచారానికే పరిమితమైన ఆ పార్టీ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

బొద్దింకల మాస్క్ లు ధరించి, భారత రాజ్యాంగ ప్రతులు, పుస్తకాలు, పువ్వులు, జాతీయ జెండాలు, ప్లకార్డులు చేతపట్టుకొని కదం తొక్కారు. ప్రవేశ పరీక్షలు, ఉద్యోగాల నియామక ప్రక్రియలో జవాబుదారీతనం కోరుతూ నినాదాలు చేశారు. సంస్కరణలు, పారదర్శకత కావాలని తేల్చిచెప్పారు. ధర్నాకు ఇతర రాష్ట్రాల నుంచి జనం వ్యయ ప్రయాసలను సైతం లెక్కచేయకుండా హాజరు కావడం గమనార్హం. పటిష్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం ప్రారంభమైన ధర్నా సాయంత్రం వరకు కొనసాగింది. 

నీట్‌(యూజీ) వాయిదా పడడం వల్ల ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీప్కే శనివారం ఉదయం అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవిత చరిత్ర పుస్తకాన్ని చేతబూని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా స్థలికి చేరుకున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా తమ పార్టీని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.  

అన్నింటికీ సిద్ధపడే వచ్చా..  
‘‘ఇది దీర్ఘకాల పోరాటం. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని నెల రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పోరాటం ప్రారంభించాం. కానీ, సిగ్గులేని పాలకులు ఆయనతో రాజీనామా చేయించకుండా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేశారు. పోస్టులు తొలగించారు. మా పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఈ విశ్వం నుంచి మమ్మల్ని ఎవరూ తొలగించలేరు. అన్నింటికీ సిద్ధపడే ఢిల్లీకి తిరిగొచ్చా. ఎలాంటి చర్యలు తీసుకున్నా భయపడే ప్రసక్తే లేదు. విమానం దిగడానికి కొద్ది క్షణాల ముందు.. నా స్వేచ్ఛా జీవితపు చివరి క్షణాలను గడుపుతున్నట్లు నాకు అనిపించింది. 

ఆశయం కోసం నా స్వేచ్ఛను త్యాగం చేయడానికి సైతం పూర్తిగా సిద్ధమయ్యా. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయి ఉండవచ్చు. జైలు శిక్ష పడుతుందనే భయంతో విశ్వాసాలను వదులుకున్నారు. కానీ విద్యార్థులు, యువత అలా ఎప్పటికీ లొంగిపోరు. మేము ఎవరికీ భయపడడం లేదు. నేను అమెరికాకు వెళ్లినప్పటి కంటే స్వదేశానికి తిరిగి వచి్చనప్పుడే నా తల్లి ఎక్కువగా బాధపడింది. నన్ను పోలీసులు అరెస్టు చేస్తారని ఆమె ఆందోళన చెందుతోంది. నా తల్లి మాత్రమే కాకుండా.. రాజకీయాల గురించి మాట్లాడే ప్రతి యువతీ యుకుకుడి తల్లి భయపడుతోంది. ఇంకెన్నాళ్లు ఇలా భయపడుతూ బతుకుతారు. ఇకపై భయపడబోమని గట్టిగా చెప్పండి’’అని అభిజిత్‌ దీప్కే పిలుపునిచ్చారు.  

నిర్మాణాత్మక మార్పు రావాలి  
పరీక్షల చుట్టూ వివాదాలు, ఫలితాలపై అనిశ్చితి, అధికారుల నుంచి జవాబుదారీతనం లేకపోవడం వంటివి విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని జంతర్‌మంతర్‌ ధర్నాలో నిరసనకారులు ఆక్షేపించారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. అధికార బీజేపీతో పాటు ప్రతిపక్షాల పనితీరుపైనా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో లోపాలు కేవలం విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు సైతం ఆందోళనకరంగా మారుతున్నాయని చెప్పారు. తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని వారు భయపడుతున్నట్లు పేర్కొన్నారు.

 దేశంలో జనాభా స్థితిగతుల్లో వస్తున్న మార్పుల గురించి తరచుగా మాట్లాడుతున్నారు తప్ప యువత భవిష్యత్తు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరసనకారులు మండిపడ్డారు. వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎక్కువ మంది కలిసి ఒకేసారి గొంతు విప్పితే అది బలంగా వినిపిస్తుందన్న ఉద్దేశంతో ఈ ధర్నాకు హాజరయ్యామని కొందరు స్పష్టంచేశారు. 

ఎక్కువ మంది రాజకీయ కోణంలో స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వాల పనితీరు నచ్చడం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యామ్నాయం కావాలని ఆకాంక్షించారు. అవినీతి ప్రతి స్థాయిలోనూ ఉందని, దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా విద్య, యువత ఆకాంక్షలు, పరిపాలన రాజకీయ మార్పుపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’పేరిట ఆన్‌లైన్‌ పోరాటం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జంతర్‌మంతర్‌ వద్ద ఆరుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతోనే ముందు జాగ్రత్త చర్యగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  
 
కాక్రోచ్‌–ఇన్‌–చీఫ్‌ అభిజిత్‌ దీప్కే  
జంతర్‌మంతర్‌ ధర్నాలో ప్రముఖ సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, సీపీఐ అగ్రనేత ఎ.రాజాతోపాటు పలువురు సామాజిక కార్యకర్తలు, విద్యారి్థ, యువజన సంఘాల సభ్యులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమానికి ఎన్సీపీ(ఎస్పీ)నేత రోహిత్‌ పవార్‌ సైతం మద్దతు పలికారు. యువత శాంతియుత నిరసన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వాంగ్‌చుక్‌ అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించడాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అభిజిత్‌ దీప్కేను కాక్రోచ్‌–ఇన్‌–చీఫ్‌గా వాంగ్‌చుక్‌ అభివర్ణించారు.  



దేశవ్యాప్తంగా ఉద్యమిస్తాం  
ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి దించేయకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్‌ రాంకా, సౌరవ్‌ దాస్‌ హెచ్చరించారు. వారు శనివారం మీడియాతో మాట్లాడారు. విద్య, పరిపాలన అంశాలపై విస్తృత యువజన ఉద్యమానికి జంతర్‌ మంతర్‌ ధర్నా నాంది పలికిందని అన్నారు. ప్రభుత్వానికి వారం రోజులపాటు సమయం ఇస్తున్నామని, ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడమో లేక ఆయనే స్వయంగా రాజీనామా చేయడమో జరగాలని తేల్చిచెప్పారు. గడువులోగా ప్రభుత్వం స్పందించపోతే మహా ఉద్యమం తప్పదన్నారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ వివిధ రాష్ట్రాల్లోని మద్దతుదారుల నుంచి తమకు సందేశాలు అందుతున్నాయని తెలిపారు. 

తదుపరి కార్యాచరణను ప్రకటించే ముందు వారంరోజులపాటు వేచి చూస్తామని పేర్కొన్నారు. శనివారం నాటి నిరసన ప్రదర్శన ఒక ముఖ్యమైన ఘట్టమని వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించడానికి యువత సిద్ధంగా ఉందన్నారు. మన విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఆ సంస్కరణను తాము మేము ఈ రోజు ప్రారంభించామని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమేనని, దేశంలో యువతకు ఎన్నో సమస్యలు ఉన్నాయని కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులు గుర్తుచేశారు. ఈ దేశంలోని జెన్‌ జెడ్, యువత రక్తంలో గాం«దీ, అంబేడ్కర్‌ ఉన్నారని స్పష్టంచేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం సాయంత్రం 5 గంటల్లోగా పదవి నుంచి దిగిపోవాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్‌ దీప్కే తొలుత డెడ్‌లైన్‌ విధించారు. తర్వాత ఆ పార్టీ నిర్వాహకులు డెడ్‌లైన్‌ను వారం రోజులకు పొడిగించారు.  
   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement