
ఢిల్లీ: హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిన నోట్ల కట్టల ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది
మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక ఢిల్లీ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు నియమించిన త్రి సభ్య కమిటీ విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున లభ్యమైన నోట్ల కట్టల్ని అక్కడ పనిచేసే సిబ్బంది మాయం చేసినట్లు తెలుస్తోంది.
వెలుగులోకి వచ్చిన నోట్ల కట్టలపై సుప్రీం కోర్టు త్రి సభ్య కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మను విచారించింది. విచారణలో నోట్ల కట్టల విలువపై స్పష్టత లేకపోవడం, అగ్నిప్రమాదం జరిగిన తర్వాత నోట్ల కట్టల్ని ఇంట్లో పనిచేసే సిబ్బంది మాయం చేయడం,నగదు వెలుగులోకి వచ్చిన గదికి తాళం వేసి ఉండడంతో, దాన్ని బలవంతంగా తెరవాల్సి రావడం వంటి అంశాలపై త్రి సభ్య కమిటీ .. జస్టిస్ యశ్వంత్ వర్మను ప్రశ్నించింది. అయితే త్రి సభ్య కమిటీకి జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.
ఈ వరుస పరిణామాలపై త్రి సభ్య కమిటీ నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకు అందించింది. ఆ నివేదికను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా..రాజీనామా చేసి తప్పుకోవడం ఉత్తమమని జస్టిస్ వర్మకు సూచించారు. అందుకు ప్రతిస్పందనగా తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని పేర్కొంటూ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు.
దీంతో జస్టిస్ వర్మ అభిశంసన (ఇంపీచ్‌మెంటు)కు సీజేఐ సంజీవ్‌ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై త్రి సభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు సీజేఐ పంపారు.