సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Cinema Hall Not A Gym: Supreme Court On Food Served At Movies - Sakshi

న్యూఢిల్లీ: సినిమా హాళ్లకు ప్రేక్షకులు బయటి నుంచి ఆహారం, పానీయాలు తీసుకెళ్లవచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసిహతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు యజమానుల ప్రవేటు ఆస్తులు కాబట్టి ప్రేక్షకులు బయటి నుంచి తెచ్చుకున్న ఆహారం, పానీయాలు లోపలికి తీసుకెళ్లకుండా నియంత్రించే హక్కు సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్‌లకు ఉంటుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

కాగా 2018 జూలై 18న సినిమా హాళ్లలోకి బయట ఆహారాన్ని తీసుకురాకుండా విధించిన నిషేధాన్ని జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు తొలగించింది. నిషేధం కారణంగా థియేటర్లలో ఏది విక్రయిస్తే అది తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే కారణంతో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా హాళ్లలో బయటి నుంచి తీసుకొచ్చే ఆహారాన్ని నిషేధించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. 

ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి సినిమా హాళ్లు ఏం జిమ్‌లు కాదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రేక్షకులు వినోదం కోసం థియేటర్లకు వస్తారని తెలిపింది. ఇది ప్రైవేట్ యాజమాన్యంలో ఉంటుంది. కాబట్టి బయటి ఆహారాన్ని అనుమతించాలా.. వద్దా అనే దానిపై హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే  పిల్లలకు ఉచిత ఆహారం, మంచి నీరు అందించాలని ఇప్పటికే  సినిమా హాళ్లను ఆదేశించామని ధర్మాసనం ఈ సందర్బంగా గుర్తు చేసింది.

సినిమా చూసేందుకు ఏ థియేటర్‌ను ఎంపిక చేసుకోవాలనేది ప్రేక్షకుడి హక్కు.. అలాగే నిబంధనలను విధించే హక్కు సినిమా హాల్‌ యాజమాన్యానికి కూడా ఉంది. అక్కడ ఉన్నవాటిని వినియోగించాలా వద్దా అనేది పూర్తిగా సినిమా ప్రేక్షకుడి ఎంపికపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆ షరతులు ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు విరుద్ధం కానంత వరకు యజమాని నిబంధనలను పెట్టడానికి పూర్తి అర్హత ఉంది’ అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.

ఈ సందర్భంగా పలు ఉదాహరణలు చెబుతూ న్యాయమూర్తులు సరదా వ్యాఖ్యలు కూడా చేశారు. ‘సినిమా హాల్లోకి ఎవరైనా జిలేబీలు తీసుకెళితే అప్పుడు పరిస్థితి ఏంటి?. ఒకవేళ జిలేబీలు తిని ప్రేక్షకుడు తన చేతి వేళ్లను సీట్‌పై తుడిస్తే క్లీనింగ్‌కు ఎవరు డబ్బు ఇస్తారు. ఇక ప్రజలు సినిమా హాల్లోకి తందూరీ చికెన్ కూడా తీసుకెళ్తారు. మరి అప్పుడు హాల్‌లో తినేసిన ఎముకలు పడేశారని కంప్లైట్‌ రావొచ్చు. ఇది కూడా ప్రజలను ఇబ్బంది పెట్టవచ్చు’’ అని  సరదాగా వ్యాఖ్యానించారు.
చదవండి: కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. యువతి కుటుంబానికి రూ.10 లక్షలు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top