మూడేళ్లుగా మారువేషంలో.. బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?

Chinese woman held for living as monk in Delhi - Sakshi

దేశ రాజధానిలో గూఢచర్య కలకలం రేగింది. బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న ఓ మహిళను చైనా పౌరురాలిగా నిర్ధారించుకున్న ఢిల్లీ పోలీసులు.. పలు అభియోగాల కింద ఆమెను అరెస్ట్‌ చేశారు. మూడేళ్లుగా భారత్‌లో ఉంటున్న ఆమె.. కీలక సమాచారం ఏమైనా చైనాకు చేరవేసిందా? ఏదైనా కుట్రకు తెర తీసిందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఢిల్లీ ఉత్తరంగా ఉన్న టిబెట్‌ శరణార్థి శిబిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గూఢచర్యానికి పాల్పడిందనే అనుమానంతో పాటు చోరీలకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే అనుమానంతోనూ ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 

నేపాల్‌ రాజధాని ఖాట్మాండుకు చెందిన డోల్మా లామా అనే బౌద్ధ సన్యాసి.. టిబెట్‌ శరణార్థి కాలనీలోని మంజు కా టిల్లాలో ఉంటున్నాడు. అయితే అతను అతను కాదని.. ఆమె అని పోలీసులు వెల్లడించారు. చైనాకు చెందిన కాయ్‌ రువో(30).. బౌద్ధ సన్యాసి వేషంలో ఇక్కడికి వచ్చినట్లు తేల్చారు. 

ఫారినర్స్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ నుంచి సేకరించిన ఆధారాలతో అతన్ని.. ఆమెగా ప్రకటించారు పోలీసులు. చైనీస్‌ పాస్‌పోర్ట్‌తో 2019లో భారత్‌లోకి కాయ్‌ రువో ప్రవేశించిందని ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు మాండరిన్‌, నేపాలీ భాషలను ఆమె మాట్లాడుతోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఆమెను అరెస్ట్‌ చేసి ప్రశ్నిస్తున్నారు. 

అయితే.. చైనా కమ్యూనిస్ట్‌ నేతలు కొందరు తనను చంపే యత్నం చేస్తున్నారని.. తప్పించుకునేందుకు ఇలా వేషం కట్టినట్లు ఆమె ప్రాథమికంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులు ఆమెను క్షుణ్ణంగా విచారించాలని నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి: ఎవరూ ఎత్తుకెళ్లలే.. గ్యాంగ్‌ రేప్‌ చేయలే!!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top