అక్కడ రష్యా.. ఇక్కడ చైనా..

China applying Russia Ukraine principle with India says Rahul Gandhi - Sakshi

ఒకే తరహా వైఖరి : రాహుల్‌ ధ్వజం

న్యూఢిల్లీ: యుద్ధంలో మునిగిన ఉక్రెయిన్, రష్యాలతో భారత్, చైనా సరిహద్దు వివాదాన్ని పోలుస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ‘ ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తూ రష్యా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మార్చేస్తోంది. అదే తరహాలో భారత్‌తో ఉన్న సరిహద్దును మార్చేందుకు చైనా తన సైన్యం చొరబాట్లతో దుస్సాహసానికి తెగబడుతోంది’ అని రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం చీఫ్‌ కమల్‌ హాసన్‌తో చర్చాగోష్టి తాలూకూ సుదీర్ఘ వీడియోను రాహుల్‌ గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు.

‘బలహీన ఆర్థిక వ్యవస్థ, దమ్ములేని నాయకత్వంలో దార్శనికత కొరవడిన ప్రజలు, విద్వేషం, ఆగ్రహం కలగలిసిన ఈ పరిస్థితులను చైనా తనకు అనువుగా మలచుకుంటోంది. లద్దాఖ్‌లోకి వస్తామంటోంది. అరుణాచల్‌లో అడుగుపెడతామంటోంది’ అని రాహుల్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఈనెల 3వ తేదీ నుంచి మొదలయ్యే భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలంటూ ఆహ్వానం పంపిన రాహుల్‌ గాంధీకి  ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, బీఎస్‌పీ చీఫ్‌ మాయావతి కృతజ్ఞతలు తెలిపారు.

ఫిబ్రవరి 24 నుంచి కాంగ్రెస్‌ ప్లీనరీ
ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఫిబ్రవరి 24 నుంచి 26 దాకా.. మూడు రోజులపాటు తమ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సోమవారం తెలియజేశారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ప్లీనరీ సందర్భంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు   వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top