బ్రేకింగ్‌: రైతులపై విరిగిన లాఠీలు

Charge on Farmers at Delhi Border - Sakshi

న్యూఢిల్లీ: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. లక్షలాది మంది రైతులు వేలాది ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దుకు ప్రవేశించారు. ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా వాటన్నింటిని దాటి ఢిల్లీ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో రైతులను నిలువరించేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగం, నీటి ట్యాంకులతో అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బారికేడ్లు పెట్టినా రైతులు వాటిని నెట్టివేసి వస్తున్నారు. 

రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు ట్రాక్ట‌ర్ ప‌రేడ్ చేప‌ట్టాలని పోలీసులు అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల‌ నుంచే ఆందోళన మొదలుపెట్టారు. స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విధంగా రైతులు దూసుకు వస్తుండడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. దీంతో సింఘు, టిక్రీ సరిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

జాతీయ జెండాలు పట్టుకుని రైతులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సరిహద్దు దాటి రైతులు ట్రాక్ట‌ర్ల‌పై ఢిల్లీలోకి ప్ర‌వేశించారు. పాండ‌వ్ న‌గ‌ర్ ద‌గ్గ‌ర్లో ఢిల్లీ, మీర‌ట్ ఎక్స్‌ప్రెస్ వేపై బారికేడ్ల‌ను రైతులు తొల‌గించారు. ముక‌ర్బా చౌక్‌లో పోలీసుల వాహ‌నంపై రైతులు కదం తొక్కారు. సంజ‌య్‌గాంధీ ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్‌లో పోలీసులు, రైతుల మ‌ధ్య వాగ్వాదం ఏర్పడింది. కొన్నిచోట్ల రైతులకు పూలస్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఓ బస్సును ధ్వంసం చేశారు. 

సరిహద్దుల్లో భారీగా రైతులు
ట్రాక్టర్‌ పరేడ్‌లో భాగంగా రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. అన్ని మార్గాల నుంచి రైతులు ఢిల్లీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు రైతులతో నిండిపోయాయి. వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లు పెట్టినా ధ్వంసం చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. నీళ్ల ట్యాంక్‌లతో రైతులను అడ్డగించారు. 

బస్సులు, పోలీస్‌ వాహనాలు ధ్వంసం
ట్రాక్టర్లు రాకుండా బస్సులను అడ్డంగా పెట్టగా రైతులను వాటిని పక్కకు తోసేశారు. ఈ సందర్భంగా అడ్డొచ్చిన పోలీసులకు కర్రలు పట్టుకుని ఎదురుదాడి చేశారు. ఢిల్లీ వెళ్లే మార్గంలో కనిపించిన పోలీస్‌ వాహనాలు, బస్సులను రైతులు ధ్వంసం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top