శాటిలైట్‌ ఇమేజింగ్‌తో సరిహద్దుల నిర్ణయం

Centre To Use Satellite Mapping To Resolve NO Border Disputes in Northeastern - Sakshi

ఈశాన్య రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ/గువాహటి/ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రాల మధ్య తరచూ తలెత్తుతున్న సరిహద్దు వివాదాలు, ఒక్కోసారి అవి హింసాత్మక రూపంగా మారుతుండటంపై కేంద్రం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇటువంటి పరిణామాలకు శాశ్వతంగా చెక్‌ పెట్టేందుకు ఆయా రాష్ట్రాల హద్దులను శాటిలైట్‌ ఇమేజింగ్‌ సాయంతో నిర్ణయించనుంది. ఈ బాధ్యతను నార్త్‌ ఈస్టర్న్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌(ఎన్‌ఈఎస్‌ఏసీ, నెశాక్‌)కి అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రాల సరిహద్దులను శాటిలైట్‌ ఇమేజింగ్‌ ద్వారా శాస్త్రీయంగా ఖరారు చేయాలన్న ఆలోచనను హోంమంత్రి అమిత్‌ షా కొన్ని నెలల క్రితం తెరపైకి తెచ్చారని ఆ అధికారులన్నారు. శాస్త్రీయంగా చేపట్టే సరిహద్దుల విభజన కచ్చితత్వంతో ఉంటుందనీ, దీని ఆధారంగా చూపే పరిష్కారం రాష్ట్రాలకు ఎక్కువ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ అధికారులు పేర్కొన్నారు.  నెశాక్‌ నుంచి అందే శాటిలైట్‌ మ్యాపింగ్‌ ప్రకారం ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరుగుతుందనీ, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందని వారు చెప్పారు. 

అస్సాం, మిజోరం సరిహద్దుల్లో జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణల్లో ఇటీవల ఐదుగురు అస్సాంకు చెందిన పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 60 మంది వరకు గాయపడటంతో ఈ ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీలు మరోసారి తెరపైకి వచ్చాయి. నార్త్‌ ఈస్టర్న్‌ కౌన్సిల్‌(ఎన్‌ఈసీ), కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ సంయుక్త ఆధ్వర్యంలో షిల్లాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న నెశాక్‌ ప్రస్తుతం ఈశాన్య ప్రాంతంలో వరద హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నెశాక్‌ సాంకేతిక సాయాన్ని అందజేస్తోంది. కాగా, 1875లో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఆధారంగా సరిహద్దుల్లోని రిజర్వు ఫారెస్టులో ఉన్న 509 చదరపు మైళ్ల ప్రాంతం తమదేనని మిజోరం వాదిస్తుండగా, అదేం కాదు, 1993లో నిర్ణయించిన ప్రస్తుత సరిహద్దునే గుర్తిస్తామని అస్సాం చెబుతోంది.

ఇద్దరు సీఎంలతో మాట్లాడిన అమిత్‌ షా
అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిమంత బిశ్వ శర్మ, జొరంతంగాలతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యకు అర్థవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు అనంతరం జొరంతంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇలా ఉండగా, జూలై 26వ తేదీన జరిగిన ఘర్షణలకు సంబంధించి అస్సాం సీఎం హిమంతపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకునే అవకాశముందని మిజోరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్‌మావియా చువాంగో వెల్లడించారు. ఈ విషయమై అధికారులతో చర్చిస్తామన్నారు. 

అరెస్టుకయినా సిద్ధం: సీఎం హిమంత 
సరిహద్దు ఘర్షణలపై నోటీసులు అందితే మిజోరం పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారని అస్సాం సీఎం హిమంత చెప్పారు. అరెస్టయినా అవుతాను గానీ, తనతోపాటు కేసులు నమోదైన రాష్ట్ర అధికారులను మాత్రం విచారణకు పంపేది లేదన్నారు. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టు నుంచి బెయిల్‌ కూడా కోరనన్నారు. చర్చలే సమస్యకు పరిష్కారమని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంత స్ఫూర్తిని సజీవంగా ఉంచటమే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top