లోక్‌సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

Centre Introduces Election Laws Amendment Bill Introduced In Lok Sabha - Sakshi

లోక్‌సభలో ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు

ఓటర్‌ ఐడీలకు ఆధార్‌ అనుసంధానం చేస్తూ బిల్లు..

సాక్షి, ఢిల్లీ: దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా ఓటరు ఐడీని ఆధార్‌ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజీజు నేడు సభలో ప్రవేశపెట్టారు.

చదవండి: కర్ణాటకలో ఒమిక్రాన్‌ కలకలం.. ఒక్కరోజే 5, దేశంలో 167కు చేరిన సంఖ్య

అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టాయి. అయినప్పటికీ దీన్ని ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లుతో పాటు లఖింపుర్‌ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలుపెట్టకుండానే లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

ఏంటీ సవరణ బిల్లు..
ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్‌ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతో పాటు బోగస్‌ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీల ఆమోద ముద్రవేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లు గానే, ఓటర్‌ ఐడీ లేదా ఎలక్టోరల్‌ కార్డుతో ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేయనున్నారు. కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించుకొనేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్టు సమాచారం. 

అలాగే, కొత్త ఓటర్లు నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు.

ఆధార్‌ నెంబర్‌తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం..  గోప్యతా హక్కుకు భంగం కలిగించడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  దేశంలో నివసించే అందరికీ ఆధార్‌ కార్డులు జారీచేస్తారని, ఓటువేసే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని మరో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.

అయితే, విపక్షాల వాదనలను కేంద్రం ఖండించింది. ఎన్నికల ప్రక్రియను విశ్వసనీయంగా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. బోగస్ ఓట్లను నిర్మూలించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top