ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ స్థలంపై పిటిషన్‌ కొట్టివేత

  Central Vista: SC Rejects Plea Against VP Residence In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ల్యూటెన్స్‌ ప్రాంతంలో  సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉపరాష్ట్రపతి భవన నిర్మాణానికి సంబంధించిన స్థలంపై అభ్యంతరాలను లేవనెత్తుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇందిరాగేట్‌కు మధ్య మూడు కిలోమీటర్ల పొడవునా కేంద్ర ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల పైచిలుకు వ్యయంతో సెంట్రల్‌ విస్టా పునర్వ్యవస్టీకరణ ప్రాజెక్టును చేపట్టడం తెల్సిందే.

ఇందులో భాగంగా కొత్త పార్లమెంట్, ఉపరాష్ట్రపతి నివాసం, పీఎంఓ, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మిస్తారు. రిక్రియేషనల్‌ కార్యాకలాపాలకు, పచ్చదనానికి ఉపయోగించాల్సిన ప్లాట్‌ను ఉపరాష్ట్రపతి నివాస భవన నిర్మాణానికి ప్రతిపాదించారని, భూవినియోగమార్పిడి నిబంధనలకు ఇది విరుద్ధమని పిటిషనర్లు వాదించారు. విమర్శించడం తేలికని, కానీ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలని, సంబంధితవర్గాలు ఉపరాష్ట్రపతి భవన నిర్మాణ ప్రతిపాదిత స్థలంపై సరైన వివరణ ఇచ్చాయని... ఇక ఇందులో కల్పించుకోవడానికి ఏమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

రూ. 206 కోట్లతో నిర్మాణం
ఉప రాష్ట్రపతి కొత్త నివాస భవనం, అధికారిక కార్యాలయ సముదాయ నిర్మాణానికి రూ. 206 కోట్ల వ్యయం కానుంది. జార్ఖండ్‌లోని బొకారో కేంద్రంగా పనిచేస్తున్న కమలాదిత్య కన్‌స్ట్రక్షన్‌ సంస్థ ఈ నిర్మాణ ప్రాజెక్టును దక్కించుకుంది. కేంద్ర ప్రజాపనుల విభాగం రూ. 214 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా... మొత్తం ఐదు సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో కమాలాదిత్య కంపెనీ 3.52 లెస్‌తో కోట్‌ చేసి నిర్మాణ కాంట్రాక్టును చేజిక్కించుకుంది. పనులు వచ్చేనెలలో ప్రారంభమై 10 నెలల్లో పూర్తికానున్నాయి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top