మంగళగిరి ఎయిమ్స్‌కు 5 అమెరికన్‌ వెంటిలేటర్లు

Central Ministers Answers MP Vijayasai Reddy Questions In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్‌-19పై పోరులో భాగంగా అమెరికా విరాళంగా అందించిన 200 ట్రాన్స్‌పోర్ట్‌ వెంటిలేటర్లను, దేశంలోని 29 కేంద్ర ప్రభుత్వాస్పత్రులు, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌  సైన్సెస్‌కు అందజేసినట్లు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వెల్లడించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎయిమ్స్‌కు 5 అమెరికన్‌ వెంటిలేటర్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బదులుగా మంత్రి అశ్వినీ కుమార్‌ సమాధానమిచ్చారు.(చదవండి: 'రూ. 3,805 కోట్లు వెంటనే విడుదల చేయాలి')

ప్రమాదాలు నివారించాలి
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా విజయసాయిరెడ్డి సభలో మాట్లాడుతూ.. విమాన ప్రమాదాలను నివారించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టేబుల్‌ టాప్‌ రన్‌వే కలిగిన విమానాశ్రయాలలో భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కేరళలోని కోళికోడ్‌, కర్ణాటకలోని మంగళూరు వంటి టేబుల్‌ టాప్‌ విమానాశ్రయాలలో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,627 కోట్ల మేర జీఎస్టీ బకాయిలు ఉన్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సభలో స్పష్టం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు జవాబు ఇచ్చారు.

అరకు లోయ పర్యాటకులకు రైల్వే శాఖ శుభవార్త
అరకు లోయ అందాలను వీక్షించాలని ఉవ్విళ్లూరే పర్యాటకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. అరకు రైలుకు మరిన్ని విస్టాడోమ్ కోచ్‌లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎంపీ విజయసాయిరెడ్డికి రైల్వే మంత్రి లేఖ రాశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top