INSACOG: భారత్‌లో కరోనా‌ వైరస్‌.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే!

Central Body INSACOG Good News On Virus Variants - Sakshi

దేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి ఊరట ఇచ్చే విషయం చెప్పింది కేంద్ర పరిధిలోని ఇన్‌సాకాగ్‌ (ఇండియన్‌ సార్స్‌ కోవ్‌ 2 జెనోమిక్స్‌ కాన్సోర్టియమ్‌). స్వల్పంగా కేసులు పెరుగుతూ పోతున్న వేళ.. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నారు. అయితే మిగతా దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా తక్కువ రీకాంబినెంట్ వేరియెంట్లు వెలుగుచూశాయని ప్రకటించింది. 

అంతేకాదు.. ఈ రీకాంబినెట్‌ వేరియెంట్‌లు.. వైరస్‌ తీవ్రవ్యాప్తికి కారణం కాలేదని, అలాగే ఆస్పత్రుల్లో చేరిన కేసులు.. తీవ్రస్థాయిలో ఇన్‌ఫెక్షన్‌కు గురైన పేషెంట్లపైనా ప్రభావం చూపలేదని ఇన్‌సాకాగ్‌ తన నివేదికలో పేర్కొంది. తాజాగా ఢిల్లీలో కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ ఫ్యామిలీకి చెందిన వేరియెంట్‌ బీఏ.2.12.1 కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ తరుణంలో వేరియెంట్ల తీవ్రతపై ఆందోళన నెలకొనగా.. తగు జాగ్రత్తలు తీసుకుంటే మరోవేవ్‌ నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులతో పాటు కేంద్రం కూడా చెబుతోంది.

రీకాంబినెంట్ అంటే.. వైరస్ యొక్క రెండు విభిన్న వైవిధ్యాల నుండి జన్యు పదార్ధాల కలయిక ద్వారా సృష్టించబడిన వైవిధ్యం. అయితే భారత్‌లో కరోనా వైరస్‌కు సంబంధించి చాలా కొద్ది సంఖ్యలో మాత్రమే రీకాంబినెట్‌ వేరియెంట్లు బయటపడ్డాయి. వాటి ప్రభావం కూడా తక్కువేనని ఇప్పుడు ప్రకటించింది ఇన్‌సాకాగ్‌. యూఎస్‌, యూకే సహా చాలా చోట్ల వేరియెంట్లు వెల్లువలా వచ్చాయి. కానీ, ఇంత జనాభా ఉన్న భారత్‌లో మాత్రం ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమని నిపుణులు అంటున్నారు. 

కేంద్ర విభాగమైన ఇన్‌సాకాగ్‌.. దేశంలో కరోనా తీరు తెన్నులు పరిశీలించడంతో పాటు వ్యాప్తి, వేరియెంట్ల మీదా పరిశోధనలు చేస్తుంది.  ఏప్రిల్‌ 8వ తేదీ వరకు(ముందు మూడు నెలల వ్యవధిలో) వచ్చిన శాంపిల్స్‌ నుంచి  రెండున్నర లక్షల దాకా శాంపిల్స్‌పై జెనెటిక్‌ సీక్వెన్స్‌ చేసి ఈ నివేదిక రూపొందించింది ఇన్‌సాకాగ్‌. ఇందులో ఒమిక్రాన్‌, డెల్టా, ఆల్ఫా, బీ.1.617.1, బీ.1.617.3, ఏవై సిరీస్‌, బేటా, గామా.. కేసులు ఉన్నాయి.

చదవండి: భయం కరోనా కోసం కాదు.. వేరే ఉంది!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top