న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ-ఓఎస్ఎమ్ (ఆన్-స్క్రీన్ మార్కింగ్) విజిల్ బ్లోయర్లలో ఒకరైన సార్థక్ సిద్ధాంత్ (17).. " కాక్రోచ్ జనతా పార్టీ" వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు ఓ సందేశం ఇచ్చాడు. ఉద్యమం ఇంటర్నెట్‌లో యూజర్ల దృష్టిని ఆకర్షించేలా కాకుండా నిజమైన కారణాల ఆధారంగా కొనసాగాలని చెప్పారు. అంటే, కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావడం, లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్లను సంపాదించడమే లక్ష్యంగా ఉద్యమాలు నడపకూడదని ఆయన చెప్పాడు.
విజిల్ బ్లోయర్ అంటే సంస్థలోని లోపాలు, అవకతవకలు, అక్రమాలను బయటపెట్టే వ్యక్తి. 12వ తరగతి మార్కుల పట్టికల్లో తేడాలను గుర్తించిన తర్వాత సీబీఎస్‌ఈ ఓఎస్ఎమ్ మూల్యాంకన వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిన కీలక వ్యక్తులుగా సిద్ధాంత్, వేదాంత్, "ఎథికల్ హ్యాకర్" నిసర్గ నిలిచారు. ఈ ముగ్గురూ దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ ఏడాది పరీక్షల వివాదాలపై వీరు గళం విప్పుతున్నారు. ఇందులో ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దైన నీట్-యూజీ 2026 పరీక్ష కూడా ఉంది. ఆ పరీక్షకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ‘‘బొద్దింకలు’’ అంటూ చేసిన వ్యాఖ్యలకు వ్యంగ్య స్పందనగా మొదలైన వైరల్ ఆన్‌లైన్ ఉద్యమం ‘‘కాక్రోచ్ జనతా పార్టీ’’ గురించి సార్థక్ సిద్ధాంత్ మాట్లాడాడు. తాను రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పాడు. విద్యార్థులు ఏర్పాటు చేసే ఏ పార్టీ అయినా, వాళ్లు చేసే ఏ ప్రచారం అయినా నిజమైన కారణం ఆధారంగా ఉండాలని తెలిపాడు.
విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు వారి ఆగ్రహాన్ని అర్థవంతమైన చర్యగా మార్చేలా ఉండాలని తెలిపాడు. సమస్య పరిష్కారం దిశగా నిజమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డాడు.
"నేను కొంత దర్యాప్తు చేశాను, నిసర్గ్ కొంత దర్యాప్తు చేశాడు. విద్యార్థులకు సాయం చేయాలనే ఉద్దేశంతో వాటిని బయటపెట్టాం" అని సార్థక్ సిద్ధాంత్ చెప్పాడు. పరిశోధన ఆధారంగా జరిగే ఉద్యమాలకు, సామాజిక మాధ్యమాల ప్రభావంతో నడిచే ధోరణులకు మధ్య తేడాను ఆయన ప్రస్తావించారు. తన వ్యాఖ్యల్లో వేదాంత్ శ్రీవాస్తవ గురించి ప్రస్తావంచాడు.
ఆన్‌లైన్ వేదికలకే ఉద్యమాన్ని పరిమితం చేయొద్దని సిద్ధాంత్ హెచ్చరించాడు. ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది, కానీ వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోవడం మాత్రం సరైంది కాదని చెప్పారు. కేవలం ఆన్‌లైన్‌లో ప్రాచుర్యం పొందడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమానికి తాను మద్దతు ఇవ్వనని తెలిపాడు.
"అవును, ఇంటర్నెట్ యాక్టివిజం బాగానే ఉంది. నేను చేసినది, నిసర్గ్ చేసినది, వేదాంత్ చేసినది సాధారణంగా ఇంటర్నెట్ యాక్టివిజమే. కానీ అభిజీత్ దిప్కే ప్రారంభించిన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నవారు వెనుక సీట్లలో కూర్చుని ఏమీ చేయకపోతే, ఏ కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొనకపోతే, అది సరికాదు" అని సిద్ధాంత్ చెప్పారు.
సార్థక్ సిద్ధాంత్ ఎవరు?
సార్థక్ సిద్ధాంత్ తన వెబ్‌సైట్ సార్థక్సిద్ధాంత్.కామ్/కోఎంప్ట్‌లో తన పరిశోధన ఫలితాలను ప్రచురించాడు. కేంద్ర ప్రజా కొనుగోలు పోర్టల్(Central Public Procurement portal)లోని టెండర్ పత్రాలను అనేక రోజుల పాటు పరిశీలించిన తర్వాత ఈ వివరాలు వెల్లడించారు. సీబీఎస్‌ఈ ఉత్తీర్ణత శాతం తగ్గడంతో ఓఎస్ఎమ్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. కొందరు విద్యార్థులు తప్పులు, అసమానతలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు.
‘హౌ సీబీఎస్‌ఈ రీరోట్ రూల్స్ టు ఫేవర్ కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే శీర్షికతో ఉన్న సిద్ధాంత్ బ్లాగ్‌లో, టెండర్ ప్రక్రియలో వరుసగా జరిగిన మూడు దశల్లో అర్హత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలను బోర్డు పద్ధతిగా మార్చిందని ఆరోపించారు. దీని వల్ల చివరకు విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు చెందిన కోఎంప్ట్ ఎడ్యూటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రయోజనం చేకూరిందని పేర్కొన్నాడు. "ప్రజా సంస్థ తన సొంత నిబంధనలను తిరిగి రాసి, విద్యార్థుల భవిష్యత్తుతో ఎలా ఆడుకుందో చెప్పే కథ ఇది" అని సిద్ధాంత్ తన బ్లాగ్ ప్రారంభంలో రాశాడు. ఆ సంస్థ ఎలాంటి తప్పూ చేయలేదంటూ ఖండించింది. సీబీఎస్‌ఈ కూడా అదే చెప్పింది.
విద్య, మహిళలు, పిల్లలు, యువజనులు, క్రీడల పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు హాజరు కావాలని సిద్ధాంత్‌ను గత మంగళవారం కోరారు. ఓఎస్ఎమ్ వ్యవస్థ కోసం సీబీఎస్‌ఈ మూడు వేర్వేరు టెండర్లు విడుదల చేసిందని సిద్ధాంత్ స్థాయీ సంఘానికి తెలిపారు. 2025 ఫిబ్రవరిలో విడుదలైన తొలి టెండర్, విన్నర్ లేకుండానే రద్దైంది. 2025 మేలో విడుదలైన రెండో టెండర్‌కు నాలుగు బిడ్లు వచ్చాయి, కానీ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. 2025 ఆగస్టులో విడుదలైన మూడో టెండర్‌కు ర్యాంక్‌గురు, టీసీఎస్, కోఎంప్ట్ బిడ్లు దాఖలు చేశాయి. సాంకేతిక దశలో ర్యాంక్‌గురు అర్హత సాధించకపోవడంతో చివరకు కాంట్రాక్ట్ కోఎంప్ట్‌కు దక్కింది.


