Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్‌ వేసిన ఎంపీ

CBI Raids On Karti P Chidambaram In Case Related to Foreign Remittances - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరంపై మరో కేసు నమోదైంది. పదకొండేళ్ల క్రితం చిదంబరం కేంద్ర మంత్రిగా ఉండగా రూ.50 లక్షల లంచం తీసుకొని ఒక విద్యుత్‌ కంపెనీ కోసం 263 మంది చైనీయులకు వీసాల మంజూరుకు సహకరించారంటూ కార్తీపై సీబీఐ కేసు నమోదు చేసింది. కార్తీతో పాటు ఆయన సన్నిహితుడు ఎస్‌.భాస్కరరామన్,  నాటి తల్వాండి సాబో పవర్‌ ప్రాజెక్టు అధ్యక్షుడు వికాస్‌ మఖారియా తదితరులపై ఏపీసీ 120బీ, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని 8, 9 సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ, చెన్నైలోని చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై, ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, ఒడిశా, పంజాబ్‌ సహా 10 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపారు. సోదాల సమయంలో చిదంబరం ఢిల్లీలో, కార్తీ లండన్‌లో ఉన్నారు. వీటిపై కార్తీ, ‘‘ఇప్పటివరకు నాపై ఎన్నిసార్లు ఇలా దాడులు చేశారో గుర్తు లేదు. ఇది కచ్చితంగా ఒక రికార్డే’’ అని ట్వీట్‌ చేశారు. 

ఎఫ్‌ఐఆర్‌లో నాపేరే లేదు: చిదంబరం
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరానికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిదంబరం కొడుకు కార్తీపై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీబీఐ దాడులపై చిదంబరం స్పందించారు. 

‘ఈ రోజు(మంగళవారం) ఉదయం చెన్నై, ఢిల్లీలోని నా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. అధికారులు ఎఫ్‌ఐఆర్‌ కాపీ చూపించారు. కానీ అందులో  నిందితుడిగా నా పేరే లేదు. అంతేగాక సోదాల్లో తమ ఇళ్లు, కార్యాలయాల నుంచి అధికారులు ఎలాంటి పత్రాలనూ స్వాధీనం చేసుకోలేదు. ఇక అధికారులు సెర్చింగ్‌ చేసే సమయం ఆసక్తికరంగా సాగింది’ అంటూ చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

చదవండి: ‘ఢిల్లీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు ఆప్‌దే’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top