Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు | Sakshi
Sakshi News home page

Enforcement Directorate (ED): ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు

Published Fri, May 10 2024 5:02 AM

Campaigning in elections not a fundamental right says Enforcement Directorate

అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దు   

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిన ఈడీ 

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నేడు తీర్పు!  

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం చేయడం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పష్టం చేసింది. అలాగే అది చట్టపరమైన హక్కు కూడా కాదని తేల్చిచెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న కారణంతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 

ఈ మేరకు గురువారం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దంటూ ఈడీ అఫిడవిట్‌ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

రాజకీయ నాయకులు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన సందర్భాలు గతంలో ఉన్నాయని, ప్రచారం చేసుకోవడానికి వారికి కోర్టులు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదని ఈడీ తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. ఎన్నికల్లో పోటీ చేయకపోయినా కేవలం ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇచి్చన ఉదంతాలు కూడా లేవని స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని ఉద్ఘాటించింది. 

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం చట్ట ముందు అందరూ సమానమేనన్న నిబంధనను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది. అదేకాకుండా ఇప్పుడు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇస్తే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఇలాంటి వెసులుబాటు కోరే అవకాశం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచి్చంది.  

కేజ్రీవాల్‌పై అతి త్వరలో ఈడీ చార్జిషీట్‌  
ఢిల్లీలో ఎక్సయిజ్‌ విధానంలో అవకతవక ల సంబంధ కేసులో ఈడీ అతి త్వరలో ప్రత్యేక మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఇతర నిందితుల పేర్లతో అదనంగా మరిన్ని వివరాలు, ఆస్తుల గురించి ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. మద్యం కుంభకోణంలో ఈడీ ఇప్పటిదాకా 18 మందిని అరెస్టు చేసింది. ఇప్పటికే ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. మరో నాలుగైదు రోజుల్లో దాఖలు చేయబోయే చార్జిషీట్‌ ఏడోది కానుంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement