హైవేపై ఆర్‌టీసీ బస్సు బీభత్సం.. మంటలు అంటుకుని ఇద్దరు మృతి

A Bus Rams 7 Vehicles On Maharashtra Highway Video Viral - Sakshi

ముంబై: అతివేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఎంఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన ఓ బస్సు ముందున్న వాహనలను ఢీకొట్టింది. ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మంటలు చెలరేగి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన నాశిక్‌-పుణె రహదారిపై పాల్సే గ్రామం వద్ద గురువారం జరిగింది. ఈ ప్రమాదం దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఎంఎస్‌ఆర్‌టీసీకి చెందిన బస్సు.. పుణె జిల్లాలోని రాజ్‌గురునగర్‌ నుంచి నాశిక్‌కు వెళుతోంది. ఈ క్రమంలో పాల్సే గ్రామం సమీపంలో బ్రేకులు ఫెయిల్‌ అవగా.. నాలుగు ద్విచక్రవాహనాలు, రెండు ఎస్‌యూవీ వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా వెళ్లి ముందున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ‘రెండు బస్సుల మధ్య రెండు బైకులు చిక్కుకుని మంటలు చెలరేగాయి. మంటల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌గురునగర్‌ నుంచి వచ్చిన బస్సుకు సైతం మంటలు అంటుకున్నాయి. స్థానికులు బస్సు అద్దాలను పగలగొట్టి 43 మందిని రక్షించారు. నాశిక్‌ అగ్నిమాపక విభాగం హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసింది.’ అని అధికారులు తెలిపారు.

బ్రేకులు పని చేయక ప్రమాదానికి కారణమైన బస్సులోని కొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని, వారిని నాశిక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం కారణంగా కొంత సమయం ట్రాఫిక్‌ సమస్య తలెత్తినట్లు చెప్పారు.

ఇదీ చదవండి: ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు.. ఐదేళ్లలో ఖర్చు ఎంతో తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top