
న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళి కోవిడ్ అనే మహా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత కాలంలో బుద్ధ భగవానుడి బోధనలు మరింతగా ఆచరణీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం ఆషాఢ పూర్ణిమ, ధమ్మచక్ర దినం సందర్భంగా ఆయన ఈ మేరకు సందేశమిచ్చారు. బుద్ధుడు బోధించిన మార్గంలో నడుస్తూ కఠిన సవాలును ఎలా అధిగమించాలో ప్రపంచానికి భారత్ ఆచరణలో చూపుతోందని అన్నారు. బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తన శిష్యులకు సందేశమిచ్చిన తొలిరోజును ధమ్మచక్ర దినంగా బౌద్ధులు జరుపుకుంటారు. ప్రస్తుత కష్టకాలంలో తథాగతుడి ఆలోచనా విధానానికి ఉన్న శక్తిని ప్రపంచం చక్కగా అర్థం చేసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు.
కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచానికి సంఘీభావంగా ఇంటర్నేషనల్ బుద్ధిస్టు కాన్ఫెడరేషన్ ‘కేర్ విత్ ప్రేయర్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. ‘‘శత్రుత్వాన్ని శత్రుత్వంతో అణచివేయలేం. ప్రేమ, దయార్ధ్ర హృదయంతోనే అది సాధ్యం’’అన్న ధమ్మపదంలోని సూక్తిని మోదీ గుర్తుచేశారు. మన బుద్ధి, మన వాక్కు, మన ప్రయత్నం, మన కార్యాచరణ మధ్య సామరస్యం మనల్ని సంతోషాల తీరానికి చేరుస్తుందని వివరించారు. బుద్ధుడి ఆశయాలు తనకు సంతోష, విషాద సమయాల్లో ప్రజలకు మేలు చేయడానికి ఎనలేని ప్రేరణ ఇస్తున్నాయని తెలిపారు. అనుకున్నది సాధించడానికి బుద్ధుడు మనకు అష్టాంగ మార్గాన్ని బోధించాడని నరేంద్ర మోదీ ప్రస్తావించారు.