
ప్రియుడితో కలిసి 8 నెలల గర్భవతి ఆత్మహత్య
తమిళనాడు: తిరుపోరూర్ పక్కన ఉన్న తండలం పంచాయతీకి చెందిన సెల్వరాజ్ కుమారుడు సురేంద్రన్ (28). అతనూ షోలింగనల్లూర్‌లో నివసించే బంధువు ప్రియాంక (25) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇంజినీర్ అయిన ప్రియాంక, పోరూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సురేంద్రన్ తల్లి, ప్రియాంక తల్లి అక్కాచెల్లెళ్లు. దీంతో ఆ కుటుంబాల్లో ఎవరూ సురేంద్రన్, ప్రియాంక స్నేహాన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. వారి స్నేహం చివరికి ప్రేమగా మారింది.
ఈ విషయం వారికి తెలియగానే రెండు కుటుంబాలూ తీవ్రంగా వ్యతిరేకించాయి. వారి మధ్య ప్రేమ ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని హెచ్చరించాయి. అయితే అప్పటికే ప్రియాంక గర్భవతి అయింది. దీంతో తమ వివాహానికి సమ్మతి తెలపాలని ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను కోరారు. కానీ రెండు కుటుంబాలు దీనిని వ్యతిరేకించాయి. అంతేకాకుండా ప్రియాంక 8 నెలల గర్భవతి కావడంతో గర్భాన్ని తొలగించడం అసాధ్యంగా మారింది. దీని కారణంగా, ప్రేమికులిద్దరూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు.
ఇదే సమయంలో ఎంతకూ తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో సురేంద్రన్, ప్రియాంక మనస్తాపంతో మంగళవారం రాత్రి తండలం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నారు. బయటకు వెళ్లిన సురేంద్రన్ తిరిగి రాకపోయేసరికి, అతని బంధువులకు అనుమానం వచ్చి అతని కోసం వెతకడానికి వెళ్లారు. స్థానికంగా ఉండే పంపు సెట్ రూంలో సురేంద్రన్, ప్రియాంక మృతి చెంది ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటన గురించి తిరుపోరూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.