
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది. బ్రిటన్‌కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
నిపుణుల బృందం.. ఆర్‌ఏఎఫ్ జెడ్‌ఎం 417 , ఏయిర్‌బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జెట్‌ను ఎయిర్‌పోర్ట్‌లోని ఒక ప్రత్యేక హ్యాంగర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.
అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది.