
ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. ఆమె అతన్ని దూరం పెట్టింది. అది భరించలేకపోయాడా యువకుడు. ఆమెపై కక్ష కట్టి ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో పట్టపగలే అంతా చూస్తుండగా ఆమె పీక కోసి అతికిరాతకంగా చంపాడు.
మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. జిల్లా ఆసుపత్రిలోని ట్రామా సెంటర్‌లో 19 ఏళ్ల సంధ్య చౌద్రీ అనే యువతి దారుణ హత్యకు గురైంది. నిందితుడు అభిషేక్ కోష్టి.. ఆసుపత్రి సిబ్బంది, రోగుల సమక్షంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. తరువాత తన గొంతు కోసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు రేకెత్తించింది.
నర్సింగ్ శిక్షణ పొందుతున్న సంధ్యను వెంబడించిన అభిషేక్ కోష్టి ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఆమెను పట్టుకుని, కిందకు నెట్టివేసి, కత్తితో ఆమె గొంతు కోశాడు. తరువాత తన గొంతుకోసుకుని బలవన్మరణానికి ప్రయత్నించాడు. ఈలోపు జనం గుమిగూడడంతో.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనను చూసిన ఆస్పత్రి అధికారి నళిన్ మాట్లాడుతూ.. నల్ల చొక్కా ధరించిన ఒక యువకుడు సంధ్యపై దాడి చేశాడని, తాను జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించడగా, తనను అడ్డుకున్నాడని, చంపేస్తానని కూడా బెదించాడని తెలిపారు.
పోలీసులు నిందితుడు అభిషేక్‌ను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో అతను.. రెండున్నరేళ్ల క్రితం సోషల్ మీడియా ద్వారా తాము కలుసుకున్నామని పోలీసులకు తెలిపాడు. తాము ప్రేమించుకుంటున్నామని, అయితే ఇటీవలి కాలంలో సంధ్య తనను పట్టించుకోవడం మానేసిందని, తన నంబర్‌ను బ్లాక్ చేసిందని చెప్పాడు. ఆమె వేరొకరిని ప్రేమిస్తున్నదని భావించి, ఆమెకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని, ఆమె హత్యకు ప్లాన్ చేసినట్లు అభిషేక్ పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నాడు. కాగా సంధ్యకు అభిషేక్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
సంధ్య హత్య అనంతరం ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రధాన రహదారిని దిగ్బంధించారు. అయితే నిందితునిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. సంధ్య హత్య జరిగిన రోజు ఆస్పత్రి ట్రామా సెంటర్‌లో 11 మంది రోగులు చేరారు. అయితే భయంతో ఎనిమిది మంది అదే రోజు డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వారు మరుసటి రోజు వెళ్లిపోయారు. ఆసుపత్రి సివిల్ సర్జన్ గురుచరణ్ చౌరాసియా మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో భద్రతా వైఫల్యంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తామన్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఆస్పత్రికి చేరుకున్నాయి. సంధ్యను హత్య చేసి, తనను తాను గాయపరచుకున్న నిందితుడు అభిషేక్ ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. ఎస్పీ మృగాఖి డేకా సారధ్యంలో కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు