కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ స్వాధీనం

Black Box Recovered From Crashed Air India Express Flight In Kerala - Sakshi

తిరువనంతపురం ‌: కేర‌ళ‌లో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 20కు చేరుకున్న‌ది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఇవాళ ఉద‌యం డైర‌క్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) అధికారులు ఎయిర్ ఇండియా విమాన బ్లాక్‌బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానం నుంచి డిజిట‌ల్ ఫ్ల‌యిట్ డేటా రికార్డ‌ర్‌(డీఎఫ్‌ఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌(సీవీఆర్‌)ను తీశారు. ఇది విమాన ఎత్తు, స్థితి, వేగం, అలాగే పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేస్తుంది. ప్రమాదానికి గురయ్యే ముందు విమానంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్లాక్‌బాక్స్‌ దోహదపడుతుంది. (విమాన ప్రమాదం : మృత్యుంజయులైన కవలలు)

కేరళలోని కోళీకోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయి- కోళీకోడ్ ఎయిరిండియా విమానం (ఐఎక్స్ - 1344) ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి రన్ వే నుంచి జారిపోయిన విషయం తెలిసిందే. దీంతో విమానం రెండు ముక్కలైంది. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఎయిరిండియా ప్రత్యేక సహాయ బృందం ఇప్పటికే కోళీకోడ్‌కు చేరుకుంది. ‘ఏంజిల్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా’ అని పిలువబడే ప్రత్యేక సహాయ బృందాన్ని ఢిల్లీ, ముంబై నుంచి కోళీకోడ్‌కు పంపించినట్లు ఎయిర్‌ ఇండియా తెలిసింది. వీరు సహాయక చర్యలను సమన్వయం చేయడం, బాధితులకు, మృతులకు, వారి కుటుంబాలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం వారి విధి. (రక్తమోడిన దృశ్యాలు, భీతిల్లిన చిన్నారులు)

కాగా ప్రమాదానికి కారణం టేబుల్‌ టాప్‌ రన్‌ వేనే కారణమని తెలిపింది. కేరళలో భారీ వర్షాల కారణంగా విమానం ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే పై తడిగా ఉండటంతో విమానం ఓవర్‌ షాట్‌ అయ్యి జారి లోయలో పడిపోయింది. అయితే అదృష్టవశాత్తు మంటలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కొండ లేదా ఎత్తైన ప్రదేశంలో చదునుగా ఉండే చోట ఈ టేబుల్‌ రన్‌వేను నిర్మిస్తారు. అందువల్ల ఈ రన్‌వేలకు ఇరువైపులా, ముందూ వెనుకా కొండలు.. లోయలు ఉంటాయి. సాధారణ విమానాశ్రయాల్లోని రన్‌వేల కంటే వీటి నిడివి కూడా చిన్నదిగా ఉంటుంది. అత్యంత నైపుణ్యం కలిగిన పైలట్లకు కూడా అయోమయాన్ని కలిగిస్తాయి. (విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top