స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు! | BJP workers pose as locals protesting against farmers at Singhu border | Sakshi
Sakshi News home page

స్థానికులు కాదు గూండాలు; వెళ్లేది లేదు!

Jan 30 2021 4:29 AM | Updated on Jan 30 2021 8:27 AM

BJP workers pose as locals protesting against farmers at Singhu border - Sakshi

సింఘు వద్ద ఎస్‌హెచ్‌వో పలివాల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి మొహంపై బూటు కాలితో తొక్కుతున్న పోలీసు

వీరు తమపై పెట్రోల్‌ బాంబులు, రాళ్లు రువ్వారని, తమ ట్రాలీలను కాల్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాము వీరి దుశ్చర్యలను అడ్డుకున్నామని, సమస్య తేలేవరకు సింఘును విడిచిపోమని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల ఆందోళనలు శుక్రవారం కొనసాగాయి. సింఘు, ఘాజీపూర్,  టిక్రి సరిహద్దుల వద్ద భారీగా రైతులు మొహరించారు. ప్రభుత్వం శాంతియుతమైన తమ ఆందోళనను ధ్వంసం చేయాలని యత్నిస్తోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ప్రజలంతా తమకు మద్దతునివ్వాలని, జనవరి 30ని సద్భావనా దివస్‌గా పాటించాలని కోరారు. గాంధీ వర్ధంతైన ఆ రోజున ఉదయం 9– సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేస్తామని చెప్పారు. 

సింఘు వద్ద స్థానికులుగా చెప్పుకుంటున్న సమూహానికి, రైతులకు మధ్య జరిగిన సంఘర్షణ పోలీసులు భాష్పవాయువు ప్రయోగించే స్థాయికి చేరింది. మరోవైపు ఘాజీపూర్‌లోని యూపీగేట్‌ వద్ద బీకేయూ నిరసనలు కొనసాగాయి. రైతు ఆందోళనకు ఆర్‌ఎల్‌డీ మద్దతు తెలిపి మహాపంచాయత్‌లో పాల్గొంది. కొత్త చట్టాలను బుట్టదాఖలు చేయకుంటే ఆందోళన మరింత విస్తృతమవుతుందని కాంగ్రెస్‌ హెచ్చరించింది. రిపబ్లిక్‌డే రోజు జరిగిన హింసాత్మక కార్యక్రమాలపై విచారణ చేస్తున్న పోలీసులు విచారణకు సహకరించాలని తికాయత్‌ సోదరులు సహా 9మంది రైతు నేతలను కోరారు.  

రైతులతో స్థానికుల గొడవ
రైతుల ట్రాక్టర్‌ పరేడ్‌లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులుగా చెప్పుకుంటున్న కొందరు కర్రలతో వచ్చి సింఘును ఖాళీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయని పోలీసులు చెప్పారు. వీరంతా స్థానికులు కాదని, గూండాలని రైతు నాయకులు ఆరోపించారు. వీరు తమపై పెట్రోల్‌ బాంబులు, రాళ్లు రువ్వారని, తమ ట్రాలీలను కాల్చేందుకు యత్నించారని ఆరోపించారు. తాము వీరి దుశ్చర్యలను అడ్డుకున్నామని, సమస్య తేలేవరకు సింఘును విడిచిపోమని స్పష్టం చేశారు.  కాగా, సింఘు సరిహద్దు వద్ద రైతు నిరసన జరుగుతున్న ప్రాంతంలో ఒక వ్యక్తి కత్తితో చేసిన దాడిలో ఎస్‌హెచ్‌ఓ గాయపడారు.   

యూపీ గేట్‌ వద్ద ఆగని నిరసన
యూపీ గేట్‌ పరిసరాలను ఖాళీ చేయాలన్న స్థానిక మెజిస్ట్రేట్‌ ఉత్తర్వును ధిక్కరిస్తూ వందలాదిమంది బీకేయూ(భారతీయ కిసాన్‌ యూనియన్‌) సభ్యులు యూపీగేట్‌ వద్దకు చేరుకుంటున్నారు.  వారిని ఖాళీ చేయించేందుకు స్థానిక ప్రభుత్వం కరెంట్‌ కోతతో సహా పలు యత్నాలు చేస్తోంది. ఘజియాబాద్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ అజయ్‌ శంకర్‌ పాండే నిరసన ప్రదేశాన్ని సందర్శించి..ఆర్ధరాత్రి కల్లా స్థలాన్ని ఖాళీ చేయాలనిమౌఖికంగా ఆదేశించారు. ఎర్రకోటపై మతపరమైన జండా ఎగరవేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్‌ సిద్ధూ ..నిజాలను బయటపెట్టేందుకు  కొంత సమయం కావాలని, విచారణకు సహకరిస్తానని ఫేస్‌బుక్‌లో ఒక వీడియోను  పోస్టు చేశాడు.  

ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్‌  
సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) శుక్రవారం ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్‌ నిర్వహించారు. దీనికి వేలాదిమంది హాజరయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను స్థానిక ప్రభుత్వాలు ఖాళీ చేయిస్తాయన్న ఆందోళన నడుమ ఈ మహాపంచాయత్‌ జరిగింది. ఘాజీపూర్‌లోని యూపీ గేట్‌ వద్ద నిరసన తెలియజేస్తున్నవారికి మద్దతుగా వందల ట్రాక్టర్లపై వేలాదిమంది మువ్వన్నెల జెండాలతో సదస్సుకు హాజరయ్యారు.

అన్నా దీక్ష... అంతలోనే విరమణ!
ముంబై: సాగు చట్టాలకు శనివారం నుంచి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సంఘసేవకుడు అన్నా హజారే(84) శుక్రవారం ప్రకటించారు. అయితే గంటల వ్యవధిలోనే దీక్ష యత్నాలను విరమిస్తున్నానని, తన డిమాండ్లలో కొన్నింటికి కేంద్రం అంగీకరించిందని మరో ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధిలో తన దీక్ష ఆరంభమవుతుందని తొలుత ఆయన వెల్లడించారు.   కొన్ని గంటల అనంతరం మరో ప్రకటన చేస్తూ ‘‘కొన్ని డిమాండ్లు నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. అందువల్ల ఆమరణ దీక్షను పక్కనపెడుతున్నాను.’’ అని చెప్పారు.

బాష్పవాయువును ప్రయోగిస్తున్న పోలీసులు


ఘాజీపూర్‌లో పోలీసుల బారికేడ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement