కంగనా రనౌత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై నడ్డా కీలక వ్యాఖ్యలు

BJP President JP Nadda Welcomes Kangana Ranaut To Join BJP - Sakshi

న్యూఢిల్లీ: ప్రజలు కోరుకుంటే, బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తన మదిలోని మాటలను వ్యక్తపరిచిన విషయం తెలిసిందే. ఆమె బీజేపీలో చేరాలనుకుంటున్న అంశంపై తాజాగా స్పందించారు కాషాయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా. కంగనా రనౌత్‌ బీజేపీలో చేరాలనుకోవటాన్ని స్వాగతిస్తున్నామని కానీ, ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వివిధ దశల్లో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌ విషయంపై ప్రశ్నించగా ఈ మేరకు పేర్కొన్నారు నడ్డా. 

‘కంగనా రనౌత్‌ పార్టీలో చేరాలనుకుంటే స్వాగతిస్తాం. పార్టీతో కలిసి పని చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థానం ఉంది. ఎన్నికల్లో పోటీ విషయానికి వస్తే, అది నేను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. అది క్షేత్రస్థాయి నుంచి ఎన్నికల కమిటీ, పార్లమెంటరీ బోర్డు వరకు వివిధ దశల్లో విస్తృత చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. బీజేపీలో చేరాలనుకునే ఎవరినైనా స్వాగతిస్తాం. అయితే, వారి స్థానంపై పార్టీ నిర్ణయిస్తుంది. మేము షరుతుల ఆధారంగా ఎవరినీ పార్టీలో చేర్చుకోము. ఎలాంటి షరతులు లేకుండా రావాలని ప్రతిఒక్కరికి తెలియజేస్తున్నా. అప్పుడే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు.

మరోవైపు.. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో తాము కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నామని తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పారు. ప్రస్తుతం హిమాచల్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 12న ఒకే దశలో జరగనున్నాయి. డిసెంబర్‌ 8న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

ఇదీ చదవండి: పొలిటికల్‌ ఎంట్రీపై కంగనా కామెంట్స్‌.. ‘బీజేపీ టికెట్‌ ఇస్తే అక్కడ పోటీ చేస్తా’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top